కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి.. మెరిట్‌ ఆధారంగా నియామక ఉత్తర్వులివ్వండి

జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రస్తావన లేకుండా మెరిట్‌ ఆధారంగా నియామక ఉత్తర్వులివ్వాలని ఎస్పీడీసీఎల్‌ను హైకోర్టు తాజాగా ఆదేశించింది.

Published : 18 Jun 2024 03:34 IST

ఎస్పీడీసీఎల్‌కు హైకోర్టు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రస్తావన లేకుండా మెరిట్‌ ఆధారంగా నియామక ఉత్తర్వులివ్వాలని ఎస్పీడీసీఎల్‌ను హైకోర్టు తాజాగా ఆదేశించింది. కామారెడ్డి జిల్లాకు చెందిన టి.గోపాల్‌  గతంలో ఎస్పీడీసీఎల్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకుని అర్హత సాధించారు. అయితే, ఎస్పీడీసీఎల్‌ ఆయనను స్థానికేతర కోటా కింద పరిగణించి ఆ పోస్టు ఇవ్వడానికి నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ గోపాల్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి 2019లో విడుదలైన నోటిఫికేషన్‌ ఆధారంగా చేపట్టే నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తిస్తాయంటూ 2021లో ఎస్పీడీసీఎల్‌ జీఎం ప్రొసీడింగ్స్‌ ఇచ్చారని, ఇవి రాష్ట్రపతి ఉత్తర్వులు, ప్రభుత్వం 2018లో జారీ చేసిన 124, 132 జీవోలకు విరుద్ధమని  పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఎస్పీడీసీఎల్‌కు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవంటూ గతంలో ఇదే హైకోర్టు తీర్పు వెలువరించిందని గుర్తుచేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్‌ మెరిట్‌ ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రస్తావన లేకుండా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్పీడీసీఎల్‌ను ఆదేశించారు.

స్థానికత వివాదంపై విచారణ 26న..

వివిధ పోస్టుల భర్తీ వ్యవహారంలో స్థానికత వివాదంపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దాఖలు చేసిన అప్పీళ్లపై ఈ నెల 26న హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 124లో స్థానిక నిబంధనల పరిగణనలో కొన్ని లోపాలున్నా.. ఎంపికైన అభ్యర్థులను స్థానికులుగా భావించాలంటూ వివిధ పిటిషన్లలో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. వీటిని సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని