మొలకెత్తని విత్తు.. పత్తికి విపత్తు!

రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు పత్తి రైతులకు శాపంగా మారాయి. జూన్‌లో 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సాగునీరందక లక్షల ఎకరాల్లో వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో మరోసారి విత్తనాలు వేసేందుకు ఆయా రైతులు సన్నద్ధమవుతున్నారు.

Published : 18 Jun 2024 03:38 IST

16 జిల్లాల్లో లోటు వర్షపాతం
లక్షల ఎకరాల్లో రెండోసారి విత్తనాలు వేయాల్సిన పరిస్థితి

నిర్మల్‌ జిల్లా కారెగాంలో రెండోసారి విత్తేందుకు దున్నుతున్న పొలం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు పత్తి రైతులకు శాపంగా మారాయి. జూన్‌లో 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సాగునీరందక లక్షల ఎకరాల్లో వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో మరోసారి విత్తనాలు వేసేందుకు ఆయా రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈ వానాకాలం సీజన్‌ ప్రారంభంలోనే తమకు చేదు అనుభవం ఎదురవుతోందని ఆందోళన చెందుతున్నారు. వానాకాలంలో సాగుచేసే ప్రధాన పంటల్లో పత్తి, కంది, సోయా ఉన్నాయి. గత సీజన్‌లో ఇవి దాదాపు 65 లక్షల ఎకరాల్లో పండాయి. ఈ సీజన్‌లో పత్తి 55 లక్షలు, కంది 8 లక్షలు, సోయా 5 లక్షల ఎకరాల్లో పండించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. వరితో పోలిస్తే వీటికి నీటి వాడకం తక్కువ. అయితే వర్షాలు సకాలంలో కురుస్తాయని, నిరుటి కంటే వర్షపాతం ఎక్కువగా ఉంటుందని వాతావరణ విభాగం, వ్యవసాయ శాఖ వెల్లడించడంతో పత్తి రైతులు ఆశాభావంతో సాగు చేపట్టారు. పొలాలు దున్ని.. పోటీపడి విత్తనాలు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఎకరాకు మాత్రమే డీలర్ల ద్వారా విత్తనాలు సరఫరా చేయించగా.. పలువురు బ్లాక్‌లో మరికొన్ని విత్తన ప్యాకెట్లు కొనుగోలు చేశారు. సీజన్‌కు సంబంధించి జూన్‌ మొదటి వారంలో 25 లక్షల ఎకరాల్లోను, రెండో వారంలో మరో 15 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. మొదటి వారం నుంచే వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. అక్కడక్కడా అడపాదడపా మాత్రమే వర్షాలు కురిశాయి. దీంతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో విత్తనాలు మొలకెత్తలేదు. మరో 5 లక్షల ఎకరాల్లో కొంతమేర మొలకెత్తాయి. ఈ 15 లక్షల ఎకరాల్లోనూ మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. మిగతా భూముల్లో కూడా వర్షాలు సకాలంలో కురవకపోతే ఇబ్బందులు తప్పేలా లేదు. 

ఎకరాకు రూ.10 వేలకు పైగా పెట్టుబడి

పత్తి సాగుకు సంబంధించి దుక్కిదున్నడం మొదలుకొని విత్తనాలు వేసేవరకూ ఎకరాకు రైతులు రూ.10 వేలకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడుల కోసం పలువురు అప్పులు చేశారు. ఆశించినమేర వర్షాల్లేక చాలామేర పొలాలకు నీటి వసతి కరవైంది. కొందరు రైతులకు బావులు ఉన్నప్పటికీ.. నీటిమట్టం తక్కువగా ఉండడంతో ఒకటి, రెండు రోజులకు మించి నీటితడి అందించలేకపోతున్నారు. దీంతో విత్తనాలు మొలకెత్తలేదు. చాలాచోట్ల అద్దెకు ట్రాక్టర్‌ ట్యాంకర్ల ద్వారా, బిందెలతో మోసుకొచ్చి నీళ్లు అందిస్తున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. మొదటి దఫా వేసిన విత్తనాలు మొలకెత్తని చోట రైతులు మళ్లీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసి రెండోదఫా వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారైనా వర్షాలు పడితేనే పంట దక్కుతుందని, లేకపోతే మళ్లీ నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

వర్షాలు సమృద్ధిగా ఉంటేనే..

వర్షాల్లేకపోతే మిగిలిన పంటలూ దక్కడం కష్టమేనని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విత్తనాలు వేసిన తర్వాత వారం రోజుల నుంచి వర్షాలు మొదలైతే నేల తడితో సజావుగా అంకురోత్పత్తి (జెర్మినేషన్‌)కి వీలుంటుందని, వర్షాల్లేకపోతే అది తగ్గి మొలకెత్తడానికి ఇబ్బంది అవుతుందని, మొలకెత్తినా మొక్క బలహీనమవుతుందని పేర్కొంటున్నారు.

సగం జిల్లాల్లో వర్షాభావమే..

జూన్‌ నెల ప్రారంభం నుంచి సోమవారం వరకు 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లాలో సాధారణం కంటే 73 శాతం తక్కువ వర్షం కురిసింది. పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి, ములుగు, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్‌ జిల్లాల్లో 48% నుంచి 23% మధ్య తక్కువ నమోదైంది. భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో 15% నుంచి 1% వరకు తక్కువ వర్షం కురిసింది. మహబూబాబాద్‌లో సగటు కంటే ఒక శాతం ఎక్కువ వర్షపాతం నమోదయినా అక్కడ కూడా చాలా మండలాల్లో పత్తి విత్తనాలు మొలకెత్తక రైతులు మళ్లీ వేస్తున్నారు. జనగామ, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సగటు కంటే అధిక వర్షపాతం నమోదైన కొన్ని జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షాభావ పరిస్థితులున్నాయి.


కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాలకు చెందిన రైతు జాగిరపు నర్సింహారెడ్డి తనకున్న 9 ఎకరాల్లో పత్తి సాగుకు ఉపక్రమించారు. రూ.వేలల్లో ఖర్చు చేసి విత్తనాలు వేశారు.    వర్షాల్లేక మొలకెత్తకపోవడంతో మళ్లీ పొలం దున్ని విత్తనాలు వేస్తున్నారు.


వరంగల్‌ జిల్లా అలంఖానిపేట రైతు సముద్రాల అశోక్‌దీ అదే పరిస్థితి. వర్షాలపై ఆశతో రూ.30 వేలకు పైగా పెట్టుబడితో ఈ నెల మొదటి వారంలో నాలుగెకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. వర్షాల్లేకపోవడంతో విత్తనాలు ఎండిపోయాయి. పరిస్థితి మొదటికొచ్చిందని ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని