తగ్గిన గ్రానైట్‌ ఉత్పత్తి

రాష్ట్రంలో 2022-23తో పోలిస్తే 2023-24లో గ్రానైట్‌ బండ ఉత్పత్తి తగ్గింది. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో అపార గ్రానైట్‌ నిక్షేపాలున్నాయి. అయినా, తవ్వకాలు తగ్గించడంతో ఈ పరిస్థితి నెలకొంది.

Published : 18 Jun 2024 03:40 IST

ప్రభావం చూపుతున్న మైనింగ్‌ రాయల్టీ, ప్రత్యామ్నాయాలు..
ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్రంలో 2022-23తో పోలిస్తే 2023-24లో గ్రానైట్‌ బండ ఉత్పత్తి తగ్గింది. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో అపార గ్రానైట్‌ నిక్షేపాలున్నాయి. అయినా, తవ్వకాలు తగ్గించడంతో ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏడాది వ్యవధిలో ఉత్పత్తి దాదాపు 50 శాతం పెరుగుదలతో క్వార్ట్జ్‌ ఖనిజం కళకళలాడుతోంది. కంకర మైనింగ్‌ 33 శాతం, మొరం మట్టి తవ్వకాలు 58 శాతానికిపైగా పెరిగాయి.

బ్లాక్, కలర్‌ గ్రానైట్‌..

గ్రానైట్‌ ఉత్పత్తి ఏడాదిలోనే 1.15 లక్షల క్యూబిక్‌ మీటర్లు తగ్గింది. రాష్ట్రంలోని గనుల నుంచి ప్రధానంగా బ్లాక్‌ గ్రానైట్‌తోపాటు కలర్‌ గ్రానైట్‌ ఉత్పత్తి అవుతుంది. గనుల్లో పెద్ద బండల ఆకారంలో తొలిచే గ్రానైట్‌లో మంచి నాణ్యత ఉన్నవాటిని లీజుదారులు విదేశాలకు తరలిస్తున్నారు. చిన్నచిన్న లోపాలున్న వాటిని ఇక్కడి ప్రాసెసింగ్‌ యూనిట్ల యజమానులు కొనుగోలు చేస్తున్నారు. ఈ యూనిట్ల యజమానులు క్వారీలకు వెళ్లి తెచ్చుకునే గ్రానైట్‌పై విధించే రాయల్టీపై కొంతకాలం క్రితం వరకు 40 శాతం మినహాయింపు ఉండేది. దాన్ని పునరుద్ధరించకపోవడంతో రాయల్టీ భారం కారణంగా యూనిట్ల యజమానులు ఉత్పత్తి తగ్గించారు.

ఆరా తీసిన ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఆదాయ వనరుల్లో మైనింగ్‌ ముఖ్యమైంది. గతేడాదితో పోలిస్తే చాలా రకాల ఖనిజాల నుంచి వచ్చే ఆదాయం తగ్గింది. దేశీయ మార్కెట్‌లో విట్రిఫైడ్‌ టైల్స్‌ వాడకం పెరిగిందనీ.. ఫలితంగా ఇళ్లలో ఫ్లోరింగ్‌కు, క్లాడింగ్‌కు గ్రానైట్‌ వాడకం తగ్గిందని అధికారులు వివరించారు. అదేవిధంగా విదేశాల్లో ప్రత్యామ్నాయంగా ఇంజినీరింగ్‌ స్టోన్‌ని వాడుతున్నారని పేర్కొన్నారు. మన దేశం నుంచి 2022-23లో రూ.3,018 కోట్ల విలువైన గ్రానైట్‌ ఎగుమతులు జరిగితే, 2023-24లో ఎగుమతుల విలువ రూ.2,444 కోట్లకు తగ్గింది.


 రాయితీ పునరుద్ధరించి.. పర్మిట్‌ ఫీజు ఎత్తేయాలి

ఉప్పల వెంకటరమణ, ఖమ్మం జిల్లా  గ్రానైట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

ప్రాసెసింగ్‌ యూనిట్లకు మైనింగ్‌ రాయల్టీపై 40 శాతం రాయితీని ఇచ్చేవారు. రెండేళ్ల గడువుండే రాయితీని పలు దఫాలు పొడిగించారు. 2024 జనవరి 27తో ముగిసిన గడువును మళ్లీ పొడిగించలేదు. దీంతో రాయల్టీ ఆర్థిక భారం యూనిట్లపై అధికమైంది. పెరిగిన ఖర్చులకుతోడు విట్రిఫైడ్‌ టైల్స్‌తో పోటీ కారణంగా గ్రానైట్‌ మెటీరియల్‌ను అమ్ముకోలేకపోతున్నాం. సహజసిద్ధ, దీర్ఘకాలం మన్నే గ్రానైట్‌ అమ్మకంపై 18 శాతం, కృత్రిమమైన విట్రిఫైడ్‌ టైల్‌్్సపై 5 శాతం పన్నుల విధానం సరికాదు. లక్షల మందికి ఉపాధి కల్పించే ప్రాసెసింగ్‌ యూనిట్లకు రాయల్టీ రాయితీ పునరుద్ధరించి పర్మిట్‌ ఫీజు ఎత్తేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని