భూపరిపాలనలో మార్పులు తేవాలి

రైతులకు మరింతగా చేరువయ్యేందుకు భూపరిపాలనలో సమగ్రమైన మార్పులు తేవాలని తెలంగాణ తహసీల్దార్ల సంఘం (టీజీటీఏ).. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరింది.

Published : 18 Jun 2024 03:42 IST

మంత్రి పొంగులేటికి తహసీల్దార్ల సంఘం వినతి

మంత్రి పొంగులేటికి సమస్యలు విన్నవిస్తున్న టీజీటీఏ అధ్యక్షుడు రాములు, ఇతర నేతలు

ఈనాడు, హైదరాబాద్‌: రైతులకు మరింతగా చేరువయ్యేందుకు భూపరిపాలనలో సమగ్రమైన మార్పులు తేవాలని తెలంగాణ తహసీల్దార్ల సంఘం (టీజీటీఏ).. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరింది. జీఓ 317ను రద్దు చేయాలని, సీపీఎస్‌ స్థానంలో పాత పెన్షన్‌ విధానాన్ని అమల్లోకి తేవాలని, రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని అభ్యర్థించింది. టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రాములు, ప్రధాన కార్యదర్శులు రమేశ్, రాజేశ్వర్, సెక్రటరీ జనరల్‌ ఫూల్‌సింగ్, మహిళా అధ్యక్షురాలు రాధ తదితరులు మంత్రిని ఆయన నివాసంలో కలిసి ఈమేరకు వినతిపత్రం సమర్పించారు. శాసనసభ ఎన్నికలకు ముందు దూరప్రాంతాలకు బదిలీ అయిన వారిని పూర్వస్థానాలకు  పంపాలని, అర్హులైన తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించాలని, అద్దె వాహనాల ఛార్జీలు పెంచడంతో పాటు పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని, కొత్తగా ఏర్పడిన మండలాల్లోని సిబ్బందికి క్రమం తప్పకుండా వేతనాలు మంజూరు చేయాలని కోరారు. రెవెన్యూశాఖలో అధికారాల వికేంద్రీకరణ జరపాలని, భూవివాదాలు పరిష్కారమయ్యేలా రెవెన్యూ కోర్టులు, అప్పిలేట్‌ అథారిటీల ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. 

అంతకుముందు హైదరాబాద్‌లోని టీజీటీఏ కార్యాలయంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తహసీల్దార్లు ఎదుర్కొంటున్న సమస్యలు.. ధరణి, భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని