రోజుకు రూ.31.66 ఖర్చుతో.. పోషకాహారం పెట్టేదెలా!

సంక్షేమ విద్యాలయాల్లో ఆరో తరగతి చదువుతున్న ఓ పదేళ్ల బాలుడికి రోజుకు రెండు పూటలా భోజనం.. ఉదయం, సాయంత్రం అల్పాహారానికి ప్రభుత్వం ఇస్తున్న మొత్తం రూ.31.66. ఈ మొత్తంతో విద్యార్థికి ప్రతి రోజు గుడ్డు, పండు సహా పౌష్టికాహారం అందించడం పెరిగిన ధరలతో సాధ్యం కాదని సంక్షేమాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా ప్రయోజనం ఉండడంలేదు.

Published : 18 Jun 2024 03:49 IST

ఆరేళ్లుగా సంక్షేమ విద్యార్థులకు పెరగని డైట్‌ ఛార్జీలు
ఏడాదిన్నర క్రితం 25-27% పెంచినా.. కాగితాలకే పరిమితం
ప్రస్తుతం 35% పెంచాలంటున్న అధికారులు
ఈనాడు, హైదరాబాద్‌

సంక్షేమ విద్యాలయాల్లో ఆరో తరగతి చదువుతున్న ఓ పదేళ్ల బాలుడికి రోజుకు రెండు పూటలా భోజనం.. ఉదయం, సాయంత్రం అల్పాహారానికి ప్రభుత్వం ఇస్తున్న మొత్తం రూ.31.66. ఈ మొత్తంతో విద్యార్థికి ప్రతి రోజు గుడ్డు, పండు సహా పౌష్టికాహారం అందించడం పెరిగిన ధరలతో సాధ్యం కాదని సంక్షేమాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా ప్రయోజనం ఉండడంలేదు. దీంతో నిర్దేశిత మెనూ అమలుకాక.. విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతోంది.

రాష్ట్రంలో సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లోని 9 లక్షల మంది విద్యార్థులకు ఆరేళ్ల క్రితం నిర్ణయించిన డైట్‌ ఛార్జీల మేరకు భోజనం పెడుతున్నారు. రెండు మూడేళ్లుగా సరకులు, మాంసం, కూరగాయల ధరలు పెరగడంతో.. నిర్దేశిత మెనూ అమలు చేయడం, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం సాధ్యం కావడం లేదని ఆయా అధికారులు వాపోతున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం డైట్‌ ఛార్జీలను 25 నుంచి 27 శాతం వరకు పెంచేందుకు ఏడాదిన్నర క్రితమే నిర్ణయం తీసుకున్నా, ఆ దస్త్రం ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ పెంపును అమలు చేస్తే ఏటా రూ.250 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా.  జూన్‌ 12 నుంచి 2024-25 విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో డైట్‌ ఛార్జీల పెంపుపై ఉత్తర్వులు వెలువడితే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం సాధ్యమవుతుందని సంక్షేమ వసతిగృహాల అధికారులు, గురుకులాల ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. అలానే ప్రస్తుత ధరలకు అనుగుణంగా డైట్‌ ఛార్జీలను 35 శాతం వరకూ పెంచాలని కోరుతున్నారు.

2017-18లో పెంపు

రాష్ట్ర ప్రభుత్వం 2017-18లో మెస్‌ ఛార్జీలను తరగతుల వారీగా నెలకు    రూ.950 నుంచి రూ.1500 వరకు పెంచింది. సంక్షేమ గురుకులాలు, వసతిగృహాలకు ప్రభుత్వం రూపాయికే కిలో సన్నబియ్యం అందిస్తున్నా, ఈ ఆరేళ్లలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. అప్పట్లో గుడ్డు ధర రూ.2.5 ఉంటే.. ప్రస్తుతం రూ.6కి చేరింది. గుడ్డు ఇవ్వని రోజు అరటిపండు ఇవ్వాలన్న నిబంధన ఉన్నా.. ప్రస్తుతం అరటిపండు ధర రూ.3 నుంచి రూ.5కి పెరిగింది. చికెన్‌ ధరలు రెండింతలయ్యాయి. పొట్టేలు మాంసం కిలో రూ.650 నుంచి రూ.900కి చేరింది. వంట నూనెల ధరలు, కూరగాయల ధరలు పెరిగాయి.  

సగం తగ్గింపు..

ఇలా ధరల పెరుగుదలతో కొన్ని సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల్లో అధికారులు గతేడాది మెనూలో కొన్ని సర్దుబాట్లు చేశారు. విద్యార్థులకు నెలకు రెండుసార్లు మటన్‌ ఇవ్వాల్సి ఉండగా ఒకసారి మాత్రమే వడ్డించారు. చికెన్‌ నాలుగుసార్లు ఇవ్వాల్సి ఉంటే రెండు నుంచి మూడుసార్లకు తగ్గించేశారు. వారంలో ఆరు రోజులు ఒకపూట గుడ్డు, ఒకపూట అరటిపండు ఇవ్వాల్సి ఉండగా.. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఇచ్చారు. కొన్నిచోట్ల బిల్లులు సరిగా రాకపోవడం, పాల సరఫరాలో ఇబ్బందులతో మజ్జిగ, పెరుగు, పెరుగువడలు నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు