సలాం.. శంకర్‌

కళ్ల ముందు ఏదైనా ప్రమాదం జరిగినా నాకెందుకులే అనే ఈ రోజుల్లో  అర కిలోమీటరు దూరం నుంచి గమనించి పరుగెత్తుకుంటూ వచ్చి నీటిలో మునిగిపోతున్న ఇద్దరిని కాపాడిన జాలరి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

Updated : 19 Jun 2024 06:52 IST

కరీంనగర్‌ దిగువ మానేరులో మునిగిపోతున్న ఇద్దరికి ప్రాణదానం 
ప్రశంసలు అందుకుంటున్న జాలరి సాహసం

విజయ్‌కుమార్‌ కుమార్తె పడిపోయిన ప్రాంతం (వృత్తంలో)

తిమ్మాపూర్, న్యూస్‌టుడే: కళ్ల ముందు ఏదైనా ప్రమాదం జరిగినా నాకెందుకులే అనే ఈ రోజుల్లో  అర కిలోమీటరు దూరం నుంచి గమనించి పరుగెత్తుకుంటూ వచ్చి నీటిలో మునిగిపోతున్న ఇద్దరిని కాపాడిన జాలరి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కరీంనగర్‌ నగరానికి చెందిన బంగారి విజయ్‌కుమార్‌ అనే ప్రభుత్వ ఉద్యోగి తన భార్య, కుమార్తె, కుమారుడు, అత్తమ్మతో కలిసి సోమవారం దిగువ మానేరు జలాశయం వద్దకు వెళ్లారు. ఫొటోలు తీసుకుంటున్న క్రమంలో కుమార్తె కాలు జారి జలాశయంలో పడిపోవడంతో కాపాడేందుకు విజయ్‌కుమార్‌ దూకారు. వారిద్దరిని కాపాడాలనే ఉద్దేశంతో పదిహేనేళ్ల కుమారుడు సైతం జలాశయంలోకి దూకాడు. అదే సమయంలో చేపలు పట్టడానికి వస్తున్న తిమ్మాపూర్‌ మండలంలోని అల్గునూరు చేపల కాలనీకి చెందిన మత్స్యకారుడు కొత్తూరి శంకర్‌ అక్కడున్న వారి కేకలు విని పరుగెత్తుకుంటూ వచ్చి జలాశయంలోకి దూకారు. యువతి, బాలుడి ప్రాణాలు కాపాడారు. కాని తన పిల్లలను కాపాడే క్రమంలో విజయ్‌కుమార్‌ మృతి చెందారు.

ముగ్గురినీ రక్షిస్తే సంతృప్తి ఉండేది: శంకర్‌

చేపల కోసం వలలు వేయడానికి వెళ్తుండగా మహిళల అరుపులు విని వేగంగా పరుగెత్తి జలాశయంలో దూకా. అప్పటికి ఇద్దరి చేతులు మాత్రమే నాకు కనిపిస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరిని తెప్ప మీద వేసి ఒడ్డుకు చేర్చా. వారి తండ్రి మృతదేహం తీసుకురావాల్సి వచ్చింది. ఆయనను కూడా కాపాడితే నాకు సంతృప్తిగా ఉండేది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని