పీఎం కిసాన్‌ సమ్మాన్‌తో రాష్ట్రంలో 29.50 లక్షల మందికి లబ్ధి

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా తెలంగాణలో 29.50 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని కేంద్ర జల్‌శక్తి, రైల్వే సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు.

Published : 19 Jun 2024 04:12 IST

కేంద్ర జల్‌శక్తి, రైల్వే శాఖల సహాయ మంత్రి సోమన్న

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్ర సహాయ మంత్రి సోమన్న. పక్కన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు

జమ్మికుంట, న్యూస్‌టుడే: పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా తెలంగాణలో 29.50 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని కేంద్ర జల్‌శక్తి, రైల్వే సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు. మంగళవారం 17వ విడత కిసాన్‌ సమ్మాన్‌ నిధులను వారణాసి వేదికగా ప్రధాని మోదీ విడుదల చేయగా.. ఆ కార్యక్రమాన్ని సోమన్న కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద ప్రధాని రూ.20,000 కోట్లు విడుదల చేశారని, అందులో తెలంగాణలోని రైతులకు రూ.590 కోట్లు దక్కాయన్నారు. ఆ సొమ్మును రైతులు పెట్టుబడిగా వాడుకోవాలని సూచించారు. అనంతరం కేవీకే జోన్‌10 అటరీ డైరెక్టర్‌ ఎస్‌ఎన్‌ మీరా మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో వినియోగించే అగ్రి డ్రోన్లపై 85 శాతం రాయితీ ఇస్తున్నామని, రైతులు వినియోగించుకోవాలని కోరారు. 

కౌశిక్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న భాజపా నాయకులు 

ఈ కార్యక్రమంలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ప్రసంగాన్ని భాజపా నాయకులు అడ్డుకోవడం వివాదానికి దారి తీసింది. కేంద్ర సహాయ మంత్రి సోమన్న ప్రసంగం అనంతరం కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌ రైతాంగానికి 24 గంటల విద్యుత్తు, రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఇచ్చారని అంటుండగా భాజపా నాయకులు అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో భాజపా నేతలు, కార్యక్రమంలో పాల్గొన్న రైతులు ‘జై మోదీ’ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యక్రమాన్ని రాజకీయం చేయొద్దంటూ భాజపా జిల్లా అధ్యక్షుడు జి.కృష్ణారెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త వెంకటేశ్వర్‌రావులు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. చివరికి మంత్రి వి.సోమన్న, పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని