ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీస్తే వేటు తప్పదు

బెవరేజెస్‌ కార్పొరేషన్‌ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎక్సైజ్‌ శాఖకు చెడ్డ పేరు వస్తోందని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Updated : 19 Jun 2024 05:55 IST

బెవరేజెస్‌ కార్పొరేషన్‌ తప్పుడు నిర్ణయాలతో సర్కారుకు చెడ్డపేరు
ఎక్సైజ్‌ శాఖ సమీక్షలో మంత్రి జూపల్లి
మద్యం కంపెనీలకు అనుమతుల వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఆదేశం

సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. పక్కన ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ శ్రీధర్, అదనపు కమిషనర్‌ అజయ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: బెవరేజెస్‌ కార్పొరేషన్‌ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎక్సైజ్‌ శాఖకు చెడ్డ పేరు వస్తోందని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టంచేశారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్‌లో మంగళవారం ఎక్సైజ్‌ శాఖపై నాలుగు గంటల పాటు మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇటీవలి కాలంలో శాఖలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మద్యం కంపెనీలకు అనుమతుల వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా, బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అధికారులు విధివిధానాలు ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నించారు. అధికారుల సొంత నిర్ణయాల వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లాయని మండిపడ్డారు. దీనిపై సంజాయిషీ ఇవ్వడంతోపాటు విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ శ్రీధర్, కార్పొరేషన్‌ జీఎం అబ్రహంలను ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

డ్రగ్‌ మాఫియాను అణచివేయాలి

మాదకద్రవ్యాలు, అక్రమంగా మద్యం తయారీ, రవాణా, కల్తీ కల్లు, గుడుంబా తయారీ, అమ్మకాలపై నిరంతర నిఘా ఉంచాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. డ్రగ్‌ మాఫియాను అణచివేయాలనే కృతనిశ్చయంతో సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని గుర్తుచేశారు. తయారీదారులు, సరఫరాదారులు, విక్రేతల జాబితాతో కూడిన సమగ్ర సమాచారాన్ని (డాటా బేస్‌) రూపొందించాలని సూచించారు. యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో, పోలీసుశాఖల సమన్వయంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. మాదకద్రవ్యాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించేలా ప్రసార, సామాజిక మాధ్యమాలు, థియేటర్లలో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. పనితీరును బట్టి ఇంక్రిమెంట్లు, పురస్కారాలు, బదిలీల్లో ప్రాధాన్యం ఇచ్చేలా విధివిధానాలు రూపొందించాలని ఆదేశాలిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని