వచ్చింది మూరెడు.. కట్టింది బారెడు!

అప్పుల భారంతో రాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతోంది. కొత్తగా ఎన్ని రుణాలు తీసుకుంటున్నా.. పాత బాకీలపై కిస్తీలు కట్టడానికి కూడా సరిపోవడం లేదని ఆర్థిక శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.

Published : 19 Jun 2024 04:12 IST

తెచ్చిన రుణాలు రూ.25 వేల కోట్లు
కట్టిన వడ్డీలు, కిస్తీలు రూ.38 వేల కోట్లు
అప్పుల భారం, నిధుల కొరతతో కొత్త ప్రభుత్వానికి కష్టాలు

ఈనాడు, హైదరాబాద్‌: అప్పుల భారంతో రాష్ట్ర ప్రభుత్వం సతమతమవుతోంది. కొత్తగా ఎన్ని రుణాలు తీసుకుంటున్నా.. పాత బాకీలపై కిస్తీలు కట్టడానికి కూడా సరిపోవడం లేదని ఆర్థిక శాఖ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రుణాల సేకరణ, కిస్తీలు కట్టడానికి వెచ్చిస్తున్న నిధుల్లో అంతరం చాలా ఎక్కువగా ఉండటం వల్ల సంక్షేమ పథకాలు, పాలనా నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం రోజుకు రూ.191 కోట్లను పాత బాకీలపై వడ్డీలు, అసలు సొమ్ము కిస్తీ కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. 2023 డిసెంబరులో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు గత 199 రోజుల్లో కొత్తగా రూ.25,188 కోట్ల రుణాలు సేకరించింది. ఇదే కాలవ్యవధిలో పాత బాకీలపై వడ్డీలు, అసలు సొమ్ముపద్దు కింద కిస్తీలకు కట్టింది రూ.38,040 కోట్లు. సగటున నెలకు రూ.6 వేల కోట్లకు పైగా కిస్తీల కింద చెల్లించాల్సి వస్తోంది.

సర్దుబాటుకు నిధుల కొరత..

కొత్తగా రుణాలు తీసుకుంటున్నా కిస్తీల చెల్లింపుల భారం వల్ల ప్రభుత్వం వద్ద మిగులు నిధులు ఉండటం లేదు. వచ్చే ఆగస్టు 15లోగా రుణమాఫీ పథకానికి కనీసం రూ.30 వేల కోట్ల నుంచి 35 వేల కోట్లను బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల తరఫున చెల్లించాల్సి ఉంది. ఈ నిధులు సొంతంగా సమకూర్చుకునే అవకాశాలు లేవని, రుణాలుగా తీసుకోవాల్సిందేనని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ఇందుకుగాను బాండ్లను విక్రయించాలా.. భూములను తాకట్టు పెట్టాలా.. ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి ప్రభుత్వ గ్యారంటీతో అప్పులు తీసుకునే అవకాశాలున్నాయా.. అనే అంశాలను పరిశీలిస్తోంది. 

బడ్జెట్‌ తయారీకి కసరత్తు

వచ్చే నెలలో శాసనసభలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) పూర్తిస్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ తయారీలో భాగంగా అన్ని శాఖల నిధుల అవసరాలపై చర్చించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశాలను నిర్వహిస్తున్నారు. కొత్త బడ్జెట్‌లో అత్యధికంగా నిధుల కేటాయింపులు వ్యవసాయ, నీటి పారుదల, విద్యుత్‌ శాఖలకే ఉంటాయని తెలుస్తోంది. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు వ్యవసాయశాఖకు రూ.40 వేల కోట్ల దాకా అవసరమని ప్రాథమిక అంచనా. ఇక విద్యుత్‌ రాయితీలకు మరో రూ.15 వేల కోట్ల దాకా అవసరమని చెబుతున్నారు. శాఖల వారీగా మంత్రులు, శాఖాధిపతులతో లోతుగా చర్చించిన తర్వాతే బడ్జెట్‌లో నిధుల కేటాయింపులను ప్రభుత్వం ఖరారు చేయనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా తీసుకునే రుణాలు రూ.50 వేల కోట్లు దాటిపోయే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని