సంక్షిప్త వార్తలు (10)

రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Updated : 19 Jun 2024 06:04 IST

నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగులో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూర్‌లో 7.3, శంకరపల్లిలో 7.1, మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలో 6.1, ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లిలో 6, హైదరాబాద్‌ జిల్లా గోల్కొండలో 5.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. యాదాద్రి భువనగిరితో పాటు హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఖైరతాబాద్, ఆసిఫ్‌నగర్, షేక్‌పేట తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో సాధారణం కన్నా 3.7 డిగ్రీలు పెరిగి 40 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. భద్రాచలంలో 3.6 పెరిగి 40.2, హనుమకొండలో 3.6 డిగ్రీలు పెరిగి 38.5, మెదక్‌లో 3.2 డిగ్రీలు పెరిగి 37.6, మహబూబ్‌నగర్‌లో 2.5 డిగ్రీలు పెరిగి 36.4, నల్గొండలో సాధారణం కన్నా 2.5 డిగ్రీలు పెరిగి 39 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 


ఎన్నికల విధుల్లో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు పరిహారం

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల విధులు నిర్వర్తిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు నష్టపరిహారం మంజూరు చేస్తూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 13 మంది మృతిచెందగా.. వారి కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున మంజూరయ్యాయి. తమ విన్నపాలతోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయని టీఎస్‌యూటీఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఎస్‌జీటీ ఉపాధ్యాయులందరికీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించాలని ఆ సంఘం మరో ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.


కవితను కలిసిన మాజీ మంత్రులు 

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అరెస్టై ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు కలిశారు. ములాఖత్‌లో భాగంగా వారిద్దరూ మంగళవారం ఉదయం ఇక్కడి జైలుకెళ్లి కవితతో మాట్లాడి ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు.


వైద్యరంగం కుంటుపడకుండా బదిలీలు చేయాలి: టీజీజీడీఏ

సుల్తాన్‌బజార్, న్యూస్‌టుడే: వైద్యారోగ్య శాఖలో చేపట్టనున్న వైద్యుల సాధారణ బదిలీల ప్రక్రియను ప్రజారోగ్యం దెబ్బతినకుండా, వైద్యరంగం కుంటుపడకుండా శాస్త్రీయంగా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) కోరింది. ఈ మేరకు మంగళవారం కోఠి డీఎంఈ కార్యాలయ ఆవరణలో విలేకరుల సమావేశంలో టీజీజీడీఏ ప్రతినిధులు బొంగు రమేశ్, పల్లం ప్రవీణ్‌కుమార్, రంగా అజ్మీరా, కృష్ణారెడ్డి, లాలూప్రసాద్‌ రాథోడ్‌ తదితరులు మాట్లాడారు. పదోన్నతుల అనంతరం బదిలీల ప్రక్రియ చేపట్టాలన్నారు.


మేడిగడ్డలో దెబ్బతిన్న చివరి గేటు తొలగింపు ప్రారంభం
బ్యారేజీలో 20వ గేటు భాగాల తొలగింపు

మహదేవపూర్, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న గేట్లలో చిట్టచివరి 20వ గేటు తొలగింపు పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. గత అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ కుంగి దెబ్బతినగా ప్రధానంగా 20వ పియర్‌ గేటు వద్దనే పగుళ్లు, చీలికలు, తదితర సమస్యలు ఏర్పడ్డాయి. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు పరిశీలించి తాత్కాలిక మరమ్మతులు, గేట్ల ఎత్తివేత, తొలగింపు పనులు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ఏడో బ్లాక్‌లో 8 గేట్లను ఒక్కొక్కటిగా ఎత్తారు. పైకెత్తడానికి వీలుకాని పరిస్థితుల్లో కట్‌ చేసి తొలగించారు. చిట్టచివరి 20వ గేటును కట్‌ చేసి భాగాలను తొలగిస్తున్నారు.


పెండింగ్‌ డీఏలపై నిర్ణయం తీసుకోవాలి
తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగులో ఉన్న నాలుగు డీఏ/డీఆర్‌ల విడుదలకు మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస డిమాండ్‌ చేసింది. మంగళవారం హైదరాబాద్‌లో ఐకాస ఛైర్మన్‌ కె.లక్ష్మయ్య అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ..డీఏ, డీఆర్‌ల పెండింగుపై ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని నగదు రహిత ఆరోగ్య సేవలు సరిగా అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రధాన కార్యదర్శి శుభాకర్‌రావు సహా ఛైర్మన్‌ సూర్యనారాయణ, రాజేంద్రబాబు, ఇతర నేతలు నర్సింగరావు, జ్ఞానేశ్వర్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


పెన్షన్‌ పెంచకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక 

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విధంగా దివ్యాంగులకు పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలని లేని పక్షంలో సీఎం ఇంటిని ముట్టడిస్తామని అఖిలభారత దివ్యాంగుల హక్కుల వేదిక హెచ్చరించింది. వేదిక జాతీయాధ్యక్షుడు కె.నాగేశ్వరరావు అధ్యక్షతన శనివారం వేదిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు పెన్షన్ల హామీని నెరవేర్చలేదని తెలిపారు. వచ్చే మంత్రిమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నారు. మహిళలతో పాటు దివ్యాంగులకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. నేతలు శ్రీనివాస్, రవీందర్, శంకర్, గోవింద్, బాలకృష్ణ, క్రాంతి, సమంత, రాజు తదితరులు పాల్గొన్నారు.  


ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి: ద.మ.రైల్వే జీఎం 

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో భద్రతాపరమైన అంశాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని జనరల్‌ మేనేజర్‌ (జీఎం) అరుణ్‌కుమార్‌ జైన్‌ అధికారుల్ని ఆదేశించారు. లోకోపైలట్లు, ట్రాక్‌ మెయింటెయినర్లు, షంటర్లు, గార్డులకు భద్రతపై కౌన్సెలింగ్‌ నిర్వహించాలని స్పష్టం చేశారు. మంగళవారమిక్కడ రైలు నిలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. రైళ్ల రాకపోకలు, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పశ్చిమబెంగాల్‌లో సోమవారం జరిగిన రైలు ప్రమాదం నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో మెరుగైన పనితీరు కనబర్చిన 12 మంది ఉద్యోగులకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మంత్‌’ అవార్డులను ప్రదానం చేశారు.


రెండు స్థిరాస్తి సంస్థలకు రెరా నోటీసులు 

ఈనాడు, హైదరాబాద్‌: ముందస్తు అనుమతి లేకుండా ప్లాట్లు విక్రయిస్తున్న రెండు స్థిరాస్తి సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘హస్తినా రియాలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ... హైదరాబాద్‌ శివారులోని కడ్తాల్‌ ఫార్మా సిటీ వద్ద బ్రిసా పేరిట, సొనెస్టా ఇన్‌ఫినిటీ ప్రమోటర్స్‌ సంస్థ... గచ్చిబౌలి సమీపంలో స్కై విల్లాస్‌ నిర్మాణానికి వీలుగా ప్లాట్లు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అనుమతి లేకుండా విక్రయించడంపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆయా సంస్థలకు నోటీసు జారీచేశాం. లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేసే వారు ఆయా సంస్థలకు రెరా అనుమతి ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ప్రీలాంచ్‌ ఆఫర్లు, ప్రకటనలు నమ్మి మోసపోవద్దు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లాట్లు, ప్లాట్లు విక్రయిస్తున్నట్లు తెలిస్తే 90000 06301కు వాట్సప్‌ చేసి, 040 29394972 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదులు సమర్పించవచ్చు.rera-maud@telangana.gov.in   లేదా  secy-rera-maud@telangana.gov.in   ఈ-మెయిళ్లకు కూడా ఫిర్యాదులు పంపవచ్చు’’ అని రెరా పేర్కొంది.


9, 10వ షెడ్యూల్‌ అంశాలను పరిష్కరించాలి
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటై పదేళ్లవుతున్నా ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోని 9, 10వ షెడ్యూల్‌ అంశాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఉమ్మడి ఆస్తుల విభజన విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోం. ఉద్యోగుల నియామకాలు, విభజన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తిరుపతిలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు భూములు కేటాయించినట్లుగానే తెలంగాణకు కూడా వసతిగృహాల నిర్మాణాలకు భూములను కేటాయించేలా చొరవ తీసుకోవాలి’’ అని శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు.


భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే ఆడ్వాణీని మంగళవారం దిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి  


సికిల్‌సెల్‌ వ్యాధిపై నేడు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు 

ఈనాడు, హైదరాబాద్‌: సికిల్‌సెల్‌ అవగాహన దినం సందర్భంగా బుధవారం రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ప్రత్యేక స్క్రీనింగ్‌ చేపట్టడంతోపాటు అవగాహన కల్పిస్తారని చెప్పారు. అన్ని జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఈ నెల 19 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు క్విజ్‌లు, వ్యాసరచన పోటీలు చేపట్టాలని తెలిపారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని