విద్యాహక్కు చట్టం అమలుపై వివరణ ఇవ్వండి

రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు పరిస్థితిపై వివరణ ఇవ్వాలని మంగళవారం ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 19 Jun 2024 04:23 IST

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు పరిస్థితిపై వివరణ ఇవ్వాలని మంగళవారం ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది యోగేష్‌ 2020లో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ చట్టం 2009లో వచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయడంలేదన్నారు. చట్టంలోని సెక్షన్‌ 121సి ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం కింద పేద విద్యార్థుల కోసం 25 శాతం సీట్లను కేటాయించాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు అది అమలు కాలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం రెండుసార్లు కౌంటర్లు దాఖలు చేసినా ఎంత మంది విద్యార్థులకు సీట్లు కేటాయించిన విషయాన్ని వివరాలు సమర్పించలేదన్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పేదలకు విద్య, వసతి సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పగా.. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ దానికి సంబంధించిన వివరాలు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించింది. సంక్షేమ రాష్ట్రంగా పేర్కొంటున్నప్పుడు పేద విద్యార్థులకు విద్యాహక్కు చట్టం కింద అవకాశం ఎందుకు కల్పించడం లేదని పేర్కొంది. చట్టం అమలుపై వివరణ ఇవ్వాలంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

ప్రభుత్వ వసతిగృహాలు, పాఠశాలల్లో సౌకర్యాల లేమిపై కె.అఖిల్‌ శ్రీగురుతేజ దాఖలు చేసిన మరో ప్రజాప్రయోజన వ్యాజ్యంపైనా హైకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం సౌకర్యాల కల్పనపై ఏం చర్యలు తీసుకుందో చెప్పాలంటూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు