రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నం

నీట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ భారాస విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్వీ) రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది.

Updated : 19 Jun 2024 05:49 IST

గేట్లు ఎక్కిన బీఆర్‌ఎస్వీ నాయకుల అరెస్టు

రాజ్‌భవన్‌ వద్ద బైఠాయించిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, బీఆర్‌ఎస్వీ నాయకులు

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: నీట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ భారాస విద్యార్థి విభాగం (బీఆర్‌ఎస్వీ) రాజ్‌భవన్‌ ముట్టడికి యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు మంగళవారం రాజ్‌భవన్‌ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఒక దశలో గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారంతా అక్కడే బైఠాయించే ప్రయత్నం చేయగా.. అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాటలు చోటుచేసుకున్నాయి. వాగ్వాదాల మధ్య వారందరినీ పోలీసులు ఎస్సార్‌నగర్‌ ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నీట్‌ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. గవర్నర్‌ చొరవ తీసుకొని ఈ సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు స్పందించకపోతే బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలుతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని