వైద్యవిద్యలో అఖిల భారత కోటాతో లాభమెంత?

వైద్యవిద్యలో అఖిల భారత కోటాలో కొనసాగడం వల్ల తెలంగాణ విద్యార్థులకు లాభం జరుగుతుందా లేదా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందని, దీనిపై నిపుణుల కమిటీని నియమించి అధ్యయనం చేయించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌.. సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.

Published : 19 Jun 2024 04:24 IST

అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించండి
సీఎం రేవంత్‌కు మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ వినతి

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యవిద్యలో అఖిల భారత కోటాలో కొనసాగడం వల్ల తెలంగాణ విద్యార్థులకు లాభం జరుగుతుందా లేదా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందని, దీనిపై నిపుణుల కమిటీని నియమించి అధ్యయనం చేయించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌.. సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. తెలంగాణ భవన్‌లో భారాస నేతలు కొప్పుల ఈశ్వర్, రూప్‌సింగ్, మన్నె గోవర్ధన్‌రెడ్డిలతో కలిసి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అఖిల భారత కోటా వల్ల తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలో 30 పీజీ వైద్య కళాశాలలు ఉండగా, అందులో 10 ప్రభుత్వ కళాశాలలు. అన్నింటిలో కలిపి మొత్తం 2,978 పీజీ సీట్లుండగా, ప్రభుత్వ పరిధిలో 1,267 ఉన్నాయి. వాటిలో 50% ‘ఆల్‌ ఇండియా’ కోటాకు వర్తిస్తాయి. ఈ కారణంగా రాష్ట్ర వైద్య విద్యార్థులు సుమారు 633 పీజీ సీట్లను కోల్పోతున్నారు. అలాగే రాష్ట్రంలో 54 వైద్య కళాశాలలుండగా, ఇందులో ప్రభుత్వానివి 27 ఉన్నాయి. వీటిలో మొత్తం 8,265 ఎంబీబీఎస్‌ సీట్లుండగా, ప్రభుత్వ కళాశాలల్లోనే 3,815 ఉన్నాయి. వీటిల్లోనూ ‘ఆల్‌ ఇండియా’ కోటా కింద 15 శాతం (572) ఎంబీబీఎస్‌ సీట్లను రాష్ట్ర విద్యార్థులు కోల్పోతున్నారు. తెలంగాణ విద్యార్థులు అఖిల భారత కోటాలో సీట్లు పొంది, ఇతర రాష్ట్రాల్లో పీజీ, ఎంబీబీఎస్‌ చదవడానికి అవకాశాలున్నాయి కదా అనే వాదన ఉన్నప్పటికీ.. ఇతర రాష్ట్రాల్లో ఐదేళ్లపాటు ఎంబీబీఎస్‌ చదివిన కారణంగా పీజీకి వచ్చేసరికి రాష్ట్ర విద్యార్థులు స్థానికంగా నాన్‌లోకల్‌ కిందకు వస్తున్నారు. దీంతో సొంత రాష్ట్రంలో పీజీలో సీటు పొందడం కష్టంగా మారుతోంది. తెలంగాణ విద్యార్థులు రాష్ట్రంలోనే ‘బి’ కేటగిరీలో అత్యధిక ఫీజులు కట్టి చేరాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అఖిల భారత కోటా వల్ల కలిగే లాభనష్టాలను నిపుణుల కమిటీతో అధ్యయనం చేస్తే బాగుంటుందని భావిస్తున్నాం’’ అని వినోద్‌కుమార్‌ విన్నవించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని