బిడ్డకు జన్మనిచ్చి.. ముగ్గురికి పునర్జన్మనిచ్చి..!

పుట్టబోయే బిడ్డ కోసం ఆ తల్లి ఎన్నో కలలు కంది.. ముద్దులొలికే ఆ రూపం చూసుకోవాలని పరితపించింది.. అయితే విధి ఆటలో ఆమె కలలు కల్లలయ్యాయి. రోడ్డు ప్రమాదం ఊపిరి తీసేసినా.. కడుపులోని బిడ్డకు ఏమీ కాకుండా భద్రంగా కాపాడుకుంది.

Published : 20 Jun 2024 06:06 IST

విధి ఆటలో ఓడినా.. అవయవదానంతో ఆమె జీవితం సార్థకం

నిమ్స్, న్యూస్‌టుడే: పుట్టబోయే బిడ్డ కోసం ఆ తల్లి ఎన్నో కలలు కంది.. ముద్దులొలికే ఆ రూపం చూసుకోవాలని పరితపించింది.. అయితే విధి ఆటలో ఆమె కలలు కల్లలయ్యాయి. రోడ్డు ప్రమాదం ఊపిరి తీసేసినా.. కడుపులోని బిడ్డకు ఏమీ కాకుండా భద్రంగా కాపాడుకుంది. ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చి జీవన్మృతురాలైంది. అంత విషాదంలోనూ ఆ కుటుంబికులు అమె అవయవాల్ని దానం చేసి పెద్ద మనసు చాటుకున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుస్సేనపురానికి చెందిన మద్దికట్ల సునీత (27) గృహిణి. భర్త చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఏడేళ్ల బాబు ఉన్నాడు. సునీత 9 నెలల గర్భిణి కాగా ఈ నెల 8న భర్త ఆమెను తీసుకుని ద్విచక్రవాహనంపై వైద్య పరీక్షల కోసం నంద్యాల వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో సునీతకు గాయాలవడంతో కుటుంబికులు సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. శస్త్రచికిత్స ద్వారా కడుపులో ఉన్న పాపకు వైద్యులు ప్రాణం పోశారు. ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. పది రోజుల పాటు వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. వైద్యులు ఆమె బ్రెయిన్‌డెడ్‌ (జీవన్మృతురాలు) అయినట్లు నిర్ధరించారు. విషయం తెలుసుకున్న జీవన్‌దాన్‌ వైద్య బృందం ఆమె భర్త ప్రహ్లాద్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో ఆమె నుంచి కాలేయం, రెండు కిడ్నీలు సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు శస్త్ర చికిత్స ద్వారా అమర్చినట్లు జీవన్‌దాన్‌ ఇన్‌ఛార్జి స్వర్ణలత తెలిపారు. ఇలా సునీత మరో ముగ్గురికి పునర్జన్మనిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని