పాత్రికేయులకు ఇళ్ల స్థలాలపై ప్రత్యేక విధానం తీసుకొస్తాం

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన పాత్రికేయులను కేసీఆర్‌ మోసం చేశారని.. సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి ఎటువంటి చర్యలూ తీసుకోలేదని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు.

Published : 20 Jun 2024 05:10 IST

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
జర్నలిస్టులను కేసీఆర్‌ మోసం చేశారని ధ్వజం
ఖమ్మంలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర మహాసభలు ప్రారంభం

టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర మహాసభల్లో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
చిత్రంలో అమర్, విరాహత్‌ అలీ, కె.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు

ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌టుడే: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన పాత్రికేయులను కేసీఆర్‌ మోసం చేశారని.. సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి ఎటువంటి చర్యలూ తీసుకోలేదని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఖమ్మం నగరంలో బుధవారం ఐజేయూ అనుబంధ తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర మహాసభలను ఆయన ప్రారంభించారు. తొలుత రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు నివాళులు అర్పించారు. సభలో మంత్రి మాట్లాడుతూ..  తెలంగాణలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రత్యేక విధానం తీసుకొస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌కు సంబంధించి గతంలో జీవోలు ఇచ్చిన స్థలాన్ని అతికొద్దిరోజుల్లోనే అప్పగించనున్నట్లు చెప్పారు. ఇతర జిల్లాలు, మండలాల్లో పనిచేసే వర్కింగ్‌ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఈ నెలాఖరుతో అక్రిడిటేషన్ల గడువు ముగుస్తున్నందువల్ల మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. కొత్త కార్డుల జారీకి జిల్లాస్థాయి కమిటీలను నియమించనున్నట్టు చెప్పారు. పాత్రికేయుల ఆరోగ్య కార్డులకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై క్యాబినెట్‌ సమావేశంలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో జర్నలిస్టులు వృత్తిపరమైన నైపుణ్యాన్ని, గౌరవాన్ని పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఖమ్మం జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, డాక్టర్‌ కూరపాటి ప్రదీప్‌కుమార్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ, ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, సెక్రటరీ జనరల్‌ బల్విందర్‌ సింగ్, టీయూడబ్ల్యూజే నాయకులు నరేందర్‌రెడ్డి, సోమసుందర్, కె.రాంనారాయణ, వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని