లక్ష్యం చేరని పంట రుణాలు

రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రైతులకు పంట రుణాల లక్ష్యాన్ని బ్యాంకులు చేరలేదు. రూ.73,436.72 కోట్ల లక్ష్యానికి గాను రూ.64,940 కోట్ల(88.42 శాతం) రుణాలు మాత్రమే ఇచ్చాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) నివేదించింది.

Published : 20 Jun 2024 05:11 IST

గత ఆర్థిక ఏడాదిలో 88 శాతానికే పరిమితమైన బ్యాంకులు
ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో మంత్రుల అసంతృప్తి
2024-25 మొత్తం వార్షిక రుణ లక్ష్యం రూ.6,33,777 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి రైతులకు పంట రుణాల లక్ష్యాన్ని బ్యాంకులు చేరలేదు. రూ.73,436.72 కోట్ల లక్ష్యానికి గాను రూ.64,940 కోట్ల(88.42 శాతం) రుణాలు మాత్రమే ఇచ్చాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) నివేదించింది. గత వానాకాలం సీజన్‌లో ఇది 79.48 శాతమే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. నిరుటి లక్ష్యం సాధించకున్నా కొత్త ఆర్థిక సంవత్సరం(2024-25)లో పంటలకు రూ.81,478.98 కోట్లు ఇవ్వాలని నిర్దేశించింది. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ మౌలిక వసతులకు రూ.4,563 కోట్లకు గాను కేవలం రూ.1,336 కోట్లే(29.27 శాతం) మంజూరు చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఎస్‌ఎల్‌బీసీ సమావేశం జరిగింది. ఇందులో 2023-24 వార్షిక రుణ ప్రణాళికపై సమీక్షతోపాటు 2024-25 వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్యాంకర్ల తీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణాల మంజూరు సరిగా లేదని, చిన్న, సన్నకారు రైతులకు పూర్తిస్థాయిలో రుణాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. 

వ్యవసాయ రంగానికి రూ.1,34,138 కోట్లకు రుణ ప్రణాళిక 

2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు మొత్తం రూ.6,33,777.48 కోట్ల రుణసాయం అందించనున్నాయి. బుధవారం విడుదల చేసిన వార్షిక రుణ ప్రణాళికలో దీనిని పేర్కొన్నారు. ప్రాధాన్య రంగంలో 2,80,550.80 కోట్ల సాయం లక్ష్యాన్ని నిర్దేశించారు. వ్యవసాయ రంగానికి రూ.1,34,138.01 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో పంట రుణాలకు రూ.81,478.98 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి దీర్ఘకాలిక రుణాలకు రూ.28,222.75 కోట్లు, మౌలిక వసతులకు రూ.5,197.91 కోట్లు, వ్యవసాయ యంత్ర పరికరాలకు రూ.19,239.87 కోట్లను లక్ష్యంగా నిర్దేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని