గ్రేస్‌ మార్కులు విద్యార్థుల హక్కేమీ కాదు

గ్రేస్‌ మార్కులు పొందడం విద్యార్థుల చట్టబద్ధ, ప్రాథమిక హక్కేమీ కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఎంబీబీఎస్‌ పరీక్ష నిర్వహించినందువల్ల పాత నిబంధనల ప్రకారం గ్రేస్‌ మార్కులు కలపాలంటూ ఆదేశాలు ఇవ్వజాలమని స్పష్టం చేసింది.

Published : 20 Jun 2024 05:12 IST

ఎంసీఐ కొత్త నిబంధనలు సబబే
హైకోర్టు స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేస్‌ మార్కులు పొందడం విద్యార్థుల చట్టబద్ధ, ప్రాథమిక హక్కేమీ కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ఎంబీబీఎస్‌ పరీక్ష నిర్వహించినందువల్ల పాత నిబంధనల ప్రకారం గ్రేస్‌ మార్కులు కలపాలంటూ ఆదేశాలు ఇవ్వజాలమని స్పష్టం చేసింది. ఎంబీబీఎస్‌ పరీక్షల్లో పాత నిబంధనల ప్రకారం విద్యార్థులు మిగతా అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై.. ఒక్కదానిలో ఫెయిల్‌ అయితే 5 వరకూ గ్రేస్‌ మార్కులు ఇచ్చే అధికారం యూనివర్సిటీలకు ఉండేది. 2023 ఆగస్టు 1న నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) గ్రేస్‌ మార్కులను తొలగిస్తూ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ పలువురు విద్యార్థులు హైకోర్టులో ఆరు పిటిషన్‌లు దాఖలు చేశారు. వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి.. బుధవారం తీర్పు వెలువరించింది. పిటిషనర్లు 2022లో నీట్‌ రాసి 2022-23 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్‌లో చేరారు. 2023 నవంబరులో జరిగిన పరీక్షలను పాత నిబంధనల కింద రాశామని, మార్కుల జాబితాలో కూడా పాత నిబంధనల మేరకేనని పేర్కొన్నారని.. కొత్త నిబంధనలను గతానికి వర్తింపజేయడం చెల్లదని, గ్రేస్‌ మార్కులు కలపకపోవడం వల్ల నష్టపోయామంటూ వారు వాదించారు. కాగా, 2023 ఆగస్టులో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయని, దాని తర్వాత నవంబరులో పరీక్షలు జరిగాయని.. అందువల్ల విద్యార్థులు ప్రత్యేక హక్కులు కోరజాలరని ఎన్‌ఎంసీ అభ్యంతరం తెలిపింది. ఇలాంటి విషయాల్లో న్యాయసమీక్షకూ పరిమితులున్నాయని పేర్కొంది. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం.. వైద్యవిద్యలో ఉన్నత విద్యాప్రమాణాలను నెలకొల్పే నిమిత్తం ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలను తీసుకొచ్చిందని తెలిపింది. కమిషన్‌ చట్టంలోని 10, 24, 25, 57 సెక్షన్ల ప్రకారం కొత్త నిబంధనలు తీసుకువచ్చే అధికారం ఎన్‌ఎంసీకి ఉందంది. ప్రాథమిక హక్కులు లేదా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిబంధనలు తీసుకొచ్చినపుడు న్యాయసమీక్ష చేయవచ్చని, ఇక్కడ ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది. విద్యార్థులు ఎంబీబీఎస్‌ కోర్సులో చేరి.. దాన్ని పూర్తి చేసి బయటికి వెళ్లేదాకా నిబంధనలను మార్చబోమని ఎవరూ హామీ ఇవ్వలేదని పేర్కొంది. మార్కుల జాబితాలో పాత నిబంధనలను పొరపాటున ప్రస్తావించి ఉంటారని వ్యాఖ్యానించింది. గ్రేస్‌ మార్కులను తొలగిస్తూ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు సమర్థనీయమేనని పేర్కొంది. ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్లకు గ్రేస్‌ మార్కులు ఇచ్చే అంశాన్ని ప్రతివాదులైన ఎన్‌ఎంసీ, యూనివర్సిటీలు పరిశీలించవచ్చంటూ.. పిటిషన్‌లపై విచారణను మూసివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని