జాప్యం వాళ్లది.. బాదుడు మనకి..!

ఛత్తీస్‌గఢ్‌ కరెంటు వ్యయంపై ‘జాతీయ విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌’ (పీఏటీ)లో తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు దాఖలు చేసిన అప్పీలుపై తీవ్ర జాప్యం జరుగుతోంది. 2018లోనే కేసు దాఖలు చేసినా ఇంతవరకూ విచారణే పూర్తికాలేదు.

Published : 20 Jun 2024 05:17 IST

ఛత్తీస్‌గఢ్‌ కరెంటు ఇచ్చే మార్వా ప్లాంటు నిర్మాణం భారం
45 నెలల ఆలస్యం.. రూ.2,574 కోట్ల అధిక వ్యయం
ఆరేళ్లయినా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో తేలని కేసు

ఛత్తీస్‌గఢ్‌లోని మార్వా విద్యుత్కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ కరెంటు వ్యయంపై ‘జాతీయ విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌’ (పీఏటీ)లో తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు దాఖలు చేసిన అప్పీలుపై తీవ్ర జాప్యం జరుగుతోంది. 2018లోనే కేసు దాఖలు చేసినా ఇంతవరకూ విచారణే పూర్తికాలేదు. మార్వా వద్ద వెయ్యి మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో నిర్మించిన ప్లాంటు నుంచి తెలంగాణకు కరెంటు సరఫరా చేస్తామని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం 2014లో తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో తెలిపింది. ఈ ప్లాంటు నిర్మాణంలో అసాధారణంగా 45 నెలల తీవ్ర జాప్యంతో నిర్మాణ వ్యయం 40 శాతం పెరిగి తెలంగాణ డిస్కంలపై భారీగా ఆర్థిక భారం పడింది. మార్వా ప్లాంటు నిర్మాణ ప్రణాళిక ప్రకారం రూ.6,317.70 కోట్ల వ్యయంతో 2012కల్లా పూర్తికావాలి. కానీ ఆలస్యం కావడంతో వ్యయం పెరిగి.. మొత్తం రూ.8,899.43 కోట్లకు పూర్తిచేసినట్లు ఛత్తీస్‌గఢ్‌ విద్యుదుత్పత్తి సంస్థ (సీఎస్‌ జెన్‌కో) ఆ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఎస్‌ఈఆర్‌సీ)లో 2018లో పిటిషన్‌ దాఖలు చేసింది. వాస్తవాలను పరిశీలించకుండా సీఎస్‌ఈఆర్‌సీ అందులో ఏకంగా 98.8 శాతం వ్యయానికి (రూ.8,892.51 కోట్లకు) ఆమోదించి తమపై అన్యాయంగా రూ.2,574 కోట్ల మేర అదనపు భారం మోపిందని తెలంగాణ డిస్కంలు విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌లో అప్పీలు చేశాయి. మార్వా ప్లాంటు నిర్మాణ ప్రణాళిక ప్రకారం మెగావాట్‌కు సగటున రూ.5.89 కోట్లు అవుతుందనుకుంటే సుదీర్ఘ జాప్యంతో రూ.8.89 కోట్లను దాటింది. మార్వా ప్లాంటు నుంచి కరెంటు కొనడానికి 2014 చివరిలో తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకునే సమయానికే దాని నిర్మాణంలో దాదాపు 21 నెలల జాప్యం నమోదై ఉంది. అయినా 2016 దాకా తెలంగాణకు కరెంటు రాలేదు.

  • తుది వ్యయం ఆధారంగా.. ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్‌సీ 2018లో బహుళ వార్షిక టారిఫ్‌ (ఎంవైటీ) ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం స్థిరఛార్జీల కింద 2018-19లో రూ.1,602.77 కోట్లు, 2019-20లో రూ.1,595.71 కోట్లు, 2020-21లో రూ.1,555.36 కోట్లు, అదనంగా ఒక్కో యూనిట్‌కు రూ.1.39 చొప్పున ఇంధన ఛార్జీని తెలంగాణ డిస్కంల నుంచి వసూలు చేయాలని ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్‌సీ తీర్పు చెప్పింది. ఈ వ్యయం మరింత భారంగా ఉందని తెలంగాణ డిస్కంలు పిటిషన్‌లో తెలిపాయి.
  • విద్యుత్‌ ప్లాంటు నిర్మాణం కోసం జెన్‌కోలు రుణం తీసుకోవడం ఆనవాయితీ. నిర్మాణం పూర్తయ్యేవరకూ దీనిపై వడ్డీ పడుతుంది. దీన్ని ‘ఇంట్రస్ట్‌ డ్యూరింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఐడీసీ) అని పిలుస్తారు. నిర్మాణంలో జాప్యం జరిగితే ఐడీసీ భారీగా పెరుగుతుంది. మార్వా ప్లాంటు వ్యయం 40% పెరగడానికి ఐడీసీ భారీగా రూ.2,994.54 కోట్లు పడటమే ప్రధాన కారణం. అదనంగా పడిన వడ్డీ (ఐడీసీ)లో 95% తెలంగాణ డిస్కంలే కట్టాలని ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్‌సీ తీర్పు చెప్పింది. కానీ అదే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కోర్బా వద్ద నిర్మించిన మరో ప్లాంటు నిర్మాణంలో జరిగిన జాప్యంతో పడిన అదనపు వడ్డీలో 50 శాతం మాత్రమే ఆ రాష్ట్ర డిస్కంల నుంచి వసూలు చేయాలని ఛత్తీస్‌గఢ్‌ ఈఆర్‌సీ తీర్పు చెప్పడం గమనార్హం. 
  • సాధారణంగా కరెంటు కొనుగోలుకు విద్యుదుత్పత్తి ప్లాంటుతోనే డిస్కంలు ఒప్పందం (పీపీఏ) చేసుకుంటాయి. మార్వా ప్లాంటు నుంచి కరెంటు కొనడానికి ఛత్తీస్‌గఢ్‌ డిస్కంలే ముందుగా పీపీఏ చేసుకోవడంతో.. తెలంగాణ డిస్కంలు ప్లాంటు నుంచి కాకుండా.. ఛత్తీస్‌గఢ్‌ డిస్కంల నుంచే పీపీఏ చేసుకోవాల్సి వచ్చింది. ఆ డిస్కంలు యూనిట్‌కు 7పైసలు కమీషన్‌ వసూలు చేయడంతో తెలంగాణ డిస్కంలపై మరికొంత భారం పడింది. 

ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌తో రూ.వందల కోట్ల భారం

- జ్యుడిషియల్‌ కమిషన్‌కు నిపుణుల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనడం వల్ల తెలంగాణ డిస్కంలపై రూ.వందల కోట్ల అదనపు భారం పడిందని విద్యుత్‌ రంగ నిపుణులు జ్యుడిషియల్‌ కమిషన్‌కు తెలిపారు. ఆ రంగ నిపుణులు వేణుగోపాలరావు, తిమ్మారెడ్డిలు కమిషన్‌ కార్యాలయానికి వచ్చి జస్టిస్‌ నరసింహారెడ్డికి వివరాలు తెలిపారు. అనంతరం తిమ్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2014లో ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నా 2017లో అది వచ్చే సమయానికి సింగరేణి, జూరాల, భూపాలపల్లి ప్లాంట్లలో విద్యుదుత్పత్తి పెరిగిందని వివరించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ సరఫరా లక్ష్యం కంటే 80 శాతం కూడా మించలేదని, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. భద్రాద్రి ప్లాంటు నిర్మాణ వ్యయం 40 శాతం అధికమై భారం పడిందన్నారు. వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా టెండర్లు పిలవకుండా ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ను నేరుగా కొనడం వల్ల రూ.వందల కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని