మూడేళ్ల బోధనా రుసుములు చెల్లించాలి

మూడేళ్లుగా డిగ్రీ, పీజీ కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్‌ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నాచౌక్‌లో శాంతి దీక్ష నిర్వహించారు.

Published : 20 Jun 2024 05:19 IST

ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్య
సంఘం శాంతి దీక్షలో నేతల డిమాండ్‌

శాంతి దీక్షలో నినాదాలు చేస్తున్న పరమేశ్వర్, రామారావు, సూర్యనారాయణరెడ్డి, రామకృష్ణ, రవీంద్రనాథ్, శ్రీధర్‌రావు

రాంనగర్, న్యూస్‌టుడే: మూడేళ్లుగా డిగ్రీ, పీజీ కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్‌ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నాచౌక్‌లో శాంతి దీక్ష నిర్వహించారు. పెద్ద ఎత్తున కళాశాలల యజమానులు హాజరయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బొజ్జ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం గత మూడేళ్లుగా బోధనా రుసుముల బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలలు మూతపడే స్థితికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చదువుకున్న నిరుద్యోగులు సొంతంగా కళాశాలలు ఏర్పాటు చేసుకొన్నారు. వారు ఉపాధి పొందడమే కాకుండా మరో పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. లక్షల మంది విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.2,500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి కేటాయిస్తుంది. అందులో నాన్‌ ప్రొఫెషనల్‌ విద్యార్థులైన జూనియర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు చెల్లించేది కేవలం 40 శాతం అంటే సుమారు రూ.వెయ్యి కోట్లే. గత మూడేళ్లుగా రూ.3 వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు కళాశాలలకు ప్రభుత్వం విడుదల చేసింది రూ.750 కోట్లు మాత్రమే. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థుల్లో సింహభాగం రైతు, గ్రామీణ ప్రాంత కుటుంబాలకు చెందిన పేదల పిల్లలే’’ అని అన్నారు. ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ మాట్లాడుతూ.. ‘‘బకాయిలను వెంటనే చెల్లించి విద్యార్థులను, కళాశాలల యాజమాన్యాలను ఆదుకోవాలి. కళాశాలల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే శాంతి దీక్ష చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. ఈ దీక్ష ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. కేవలం మా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్ష’’ అని వివరించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు టి.శ్రీధర్‌రావు, ఎ.పరమేశ్వర్, శంకర్, రవీంద్రనాథ్, అనంత రాములు, ప్రభాకర్, రామారావు, వివిధ కళాశాలల యజమానులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని