తల్లిదండ్రుల వాదన వినకుండా ఆదేశాలివ్వలేం

వివాహాన్ని రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సబ్‌రిజిస్ట్రార్‌ నిరాకరించిన అంశంలో తల్లిదండ్రుల వాదన వినకుండా ఆదేశాలివ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపినందునే రిజిస్ట్రార్‌ నిరాకరించారని, పిటిషన్‌లో తల్లిదండ్రులు ప్రతివాదులు కానప్పటికీ అధికరణ 226 కింద వారి ప్రయోజనాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని వ్యాఖ్యానించింది.

Published : 20 Jun 2024 05:21 IST

భిన్న మతస్థుల వివాహ రిజిస్ట్రేషన్‌పై హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: వివాహాన్ని రిజిస్ట్రేషన్‌ చేసేందుకు సబ్‌రిజిస్ట్రార్‌ నిరాకరించిన అంశంలో తల్లిదండ్రుల వాదన వినకుండా ఆదేశాలివ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపినందునే రిజిస్ట్రార్‌ నిరాకరించారని, పిటిషన్‌లో తల్లిదండ్రులు ప్రతివాదులు కానప్పటికీ అధికరణ 226 కింద వారి ప్రయోజనాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని వ్యాఖ్యానించింది. వారి వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పింది. తమ వివాహాన్ని ఎస్‌.ఆర్‌.నగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌ ఎస్‌.ఆర్‌.నగర్‌కు చెందిన ఎస్‌.వైదేహి, యూసఫ్‌గూడకు చెందిన నజీబుద్దీన్‌లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..‘వేర్వేరు మతాలకు చెందిన యువతీయువకులు కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. యువతి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారు లేకుండా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మార్చి 13న దరఖాస్తు చేసుకోగా అదే రోజు నోటీసు జారీ అయింది. అభ్యంతరాలు తెలిపేందుకు వీలుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నోటీసు అంటించారు. అభ్యంతరాల స్వీకరణకు జూన్‌ 10వ తేదీ వరకు గడువు ఉండగా.. జూన్‌ 1న పిటిషనర్లు కార్యాలయానికి వెళ్లారు. తమ కుమార్తెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముస్లిం కావడం, అతనికి ఎలాంటి ఆదాయం లేనందున వివాహానికి అనుమతించరాదంటూ ఆమె తల్లిదండ్రులు ఏప్రిల్‌ 4న లేఖ ఇచ్చారని చెబుతూ రిజిస్ట్రార్‌ వివాహ రిజిస్ట్రేషన్‌కు నిరాకరించడంతో పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారని’ వారి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఈ విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉందనడంతో.. వారిని ప్రతివాదులుగా చేర్చడానికి గడువు కోవాలని న్యాయవాది కోరారు. న్యాయమూర్తి అందుకు అనుమతిస్తూ విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని