సంక్షిప్తవార్తలు (7)

శరీరం, మనసుల మధ్య సమతౌల్యాన్ని సాధించడానికి యోగా దోహదపడుతుందని ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ తెలిపారు.

Updated : 21 Jun 2024 06:53 IST

శరీరం, మనసుల సమతౌల్యానికి యోగా
ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌

ఈనాడు, హైదరాబాద్‌: శరీరం, మనసుల మధ్య సమతౌల్యాన్ని సాధించడానికి యోగా దోహదపడుతుందని ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ తెలిపారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ..తన సందేశాన్ని విడుదల చేశారు. ‘‘యోగా చేస్తే శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సు పెంపొంది.. అపారమైన సామర్థ్యం కలుగుతుంది. ప్రజలందరూ నిత్యం యోగా చేయాలని కోరుతున్నా’’ అని రాధాకృష్ణన్‌ తెలిపారు.


సాగర్‌ నీటి క్యారీ ఓవర్‌కు అనుమతులివ్వండి! 

-కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ 

ఈనాడు, హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి గత నీటి సంవత్సరంలో (జూన్‌- మే) వినియోగించుకోని 7.50 టీఎంసీలను ఈ ఏడాది వినియోగించుకోవడానికి అనుమతించాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ తాజాగా బోర్డుకు లేఖ రాసింది. ప్రస్తుతం సాగర్‌లో నిల్వ ఉన్న నీటిలో గతేడాది రాష్ట్రం వాడుకోని వాటా నీళ్లు ఉన్నాయి. బచావత్‌ ట్రైబ్యునల్‌ నిబంధనల ప్రకారం ఒక నీటి సంవత్సరంలో వినియోగించుకోలేని నీటిని మరుసటి ఏడాది క్యారీ ఓవర్‌ కింద ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు తెలంగాణ వాటా నీటిని ఈ ఏడాదికి బదలాయిస్తూ వినియోగానికి బోర్డు అనుమతించాలి’ అని లేఖలో కోరింది. 


అన్నారంలో నీటి పరిశోధక బృందం పరిశీలన

పరిశీలిస్తున్న నిపుణుల బృందం

కాళేశ్వరం, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీకి గురువారం సెంట్రల్‌ వాటర్, పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(పుణె)కు చెందిన ఆరుగురు నిపుణుల బృందం చేరుకుంది. పుణెకు చెందిన శాస్త్రవేత్త ధనుంజయ్‌ నేతృత్వంలో నిపుణుల బృందం బ్యారేజీ ఎగువ, దిగువ భాగాలను, నాలుగు ప్రాంతాల్లో ఏర్పడిన సీపేజీల మరమ్మతులను పరిశీలించింది. జియో ఫిజికల్, జియో టెక్నికల్‌ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వాటితో పాటు తాజాగా 34వ వెంట్‌ వద్ద డ్రిల్లింగ్‌ పనుల గురించి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయికి శుక్రవారం పరికరాలు రానుండగా అదే రోజు పరీక్షలు చేయనున్నారు. కార్యక్రమంలో ఈఈ యాదగిరి, డీఈఈ రవిచంద్ర పాల్గొన్నారు.


బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు విడుదల చేయాలి

భారాస ఎమ్మెల్సీలు వాణీదేవి, దేశపతి, ఆ సంస్థ మాజీ ఛైర్మన్‌ కేవీ రమణాచారి

ఈనాడు, హైదరాబాద్‌: బ్రాహ్మణుల్లో అనేక మంది పేదవాళ్లు ఉన్నారని, వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ పరిషత్‌కు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని భారాస ఎమ్మెల్సీలు వాణీదేవి, దేశపతి శ్రీనివాస్, బ్రాహ్మణ పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ కేవీ రమణాచారి, దేవీప్రసాద్‌ కోరారు. తెలంగాణభవన్‌లో గురువారం వారు మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ సీఎం అయ్యాక బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ఏర్పాటు చేశారు. ప్రతి నెలా ధూపదీప నైవేద్యం ద్వారా అర్చకులను ఆదుకున్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బ్రాహ్మణుల సంక్షేమం పట్టడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా బ్రాహ్మణ సంక్షేమ నిధులు రెట్టింపు చేయాలి. పరిషత్‌కు కొత్త పాలకవర్గం ఏర్పాటు చేయాలి. బ్రాహ్మణ విద్యార్థులకు విదేశీ స్కాలర్‌షిప్‌ను విడుదల చేయాలి’’ అని వారు కోరారు.


మిగిలిపోయిన ఖాళీలనూ భర్తీ చేయండి

జాక్టో నేతల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: మల్టీ జోన్‌-1లో కొందరు ఉపాధ్యాయులకు రెండు, మూడు సబ్జెక్టుల్లో పదోన్నతులు దక్కాయని.. వారు చేరిన సబ్జెక్టును మినహాయించి మిగిలిన ఖాళీలను ఈ షెడ్యూల్‌లోనే భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ప్రభుత్వానికి విన్నవించింది. జాక్టో ఛైర్మన్‌ జి.సదానందంగౌడ్, కోశాధికారి కె.కృష్ణుడు గురువారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కలిసి ఈమేరకు వినతిపత్రం సమర్పించారు. గత తొమ్మిదేళ్లుగా పదోన్నతులు, అయిదేళ్లుగా బదిలీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డి, విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పదోన్నతులు ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన ఖాళీలను సీనియారిటీ ఆధారంగా భర్తీ చేస్తే పాఠశాలల్లో సబ్జెక్టు నిపుణుల కొరత పూర్తిగా తీరుతుందని సూచించారు. ప్రస్తుత బదిలీలు, పదోన్నతుల్లో జరిగిన పొరపాట్లను సవరించి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. 


పెండింగ్‌ డీఏలు విడుదల చేయండి: టీఎన్‌జీవో 

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు బకాయిపడిన డీఏలను విడుదల చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఉద్యోగుల సమస్యలపై నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుడు ఆచార్య కోదండరాంను గురువారం టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేని కోరారు. ఈ మేరకు స్పందించి సీఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చినట్లు సంఘం నేతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు ఉమాదేవి, గోవర్ధన్‌రెడ్డి, శంకర్‌ ఉన్నారు.


జోసా కౌన్సెలింగ్‌లో 100 మంది గురుకుల విద్యార్థులకు సీట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్‌టీఐలో 2024-25 ఏడాదికి ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నిర్వహించిన ఉమ్మడి సీట్ల కేటాయింపు అథారిటీ (జోసా) కౌన్సెలింగ్‌లో 100 మంది ఎస్సీ గురుకుల విద్యార్థులు సీట్లు పొందారని గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. ఐఐటీల్లో 35 మంది, ఎన్‌ఐటీల్లో 39 మంది, ఐఐటీ, జీఎఫ్‌టీఐలో 26 మంది సీట్లు పొందారని వివరించారు. మిగతా ఐదురౌండ్ల కౌన్సెలింగ్‌ పూర్తయితే సీట్లు పొందే విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.


రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి రెండోవిడత సీట్ల కేటాయింపు జాబితాను బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు వెల్లడించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26లోగా కళాశాలల్లో ధ్రువపత్రాలతో రిపోర్టు చేయాలని సూచించారు.


గురుకుల డిగ్రీ రెండోవిడత సీట్ల జాబితా వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి రెండోవిడత సీట్ల కేటాయింపు జాబితాను బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు వెల్లడించారు. విద్యార్థులు ఈ నెల 26లోగా కళాశాలల్లో ధ్రువపత్రాలతో రిపోర్టు చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని