పాత్రికేయుల భద్రతకు చట్టం తెచ్చేందుకు కృషి

రాష్ట్రంలో పాత్రికేయుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Updated : 21 Jun 2024 05:26 IST

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

సమావేశంలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క. చిత్రంలో నరేందర్‌రెడ్డి, రాంనారాయణ, విరాహత్‌అలీ, శ్రీనివాస్‌రెడ్డి, సిన్హా 

ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పాత్రికేయుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఐజేయూ అనుబంధ తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర మహాసభల ముగింపు సమావేశంలో గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో రాష్ట్ర పాత్రికేయులకు భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుండా పోయిందని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో అటువంటి సమస్యలు ఉత్పన్నం కాబోవన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి విద్య, వైద్యం, గృహ వసతి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎంత వేగంగా వార్తలు వచ్చినప్పటికీ పత్రికల్లో వచ్చిన వాటినే ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. అందువల్లే పత్రికలు ప్రజల్లో ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీని అభినందించారు. సమావేశంలో రాష్ట్ర మీడియా అకాడమీ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ నాయకులు దేవులపల్లి అమర్, నరేందర్‌రెడ్డి, సిన్హా, వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక

టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కె.విరాహత్‌అలీ, ప్రధాన కార్యదర్శిగా కె.రాంనారాయణ, ఉపాధ్యక్షులుగా జి.మధు, ఫైజల్, బి.సంపత్‌కుమార్, కార్యదర్శులుగా కె.శ్రీకాంత్‌రెడ్డి, జి.మధుగౌడ్, వి.యాదగిరి, కోశాధికారిగా ఎం.వెంకట్‌రెడ్డిలతోపాటు 16 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని