భూములు కోల్పోయిన రైతులకు 6 వారాల్లో పునరావాస ప్రయోజనాలు అందించాలి

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్‌ నిమిత్తం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట అనంతగిరిలో సేకరించిన వ్యవసాయ భూములకు గాను 6 వారాల్లో పునరావాస ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

Updated : 21 Jun 2024 05:25 IST

అప్పటివరకు వారిని ఖాళీ చేయించొద్దు
అనంతగిరి రిజర్వాయర్‌ భూసేకరణపై హైకోర్టు తీర్పు

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అనంతగిరి రిజర్వాయర్‌ నిమిత్తం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట అనంతగిరిలో సేకరించిన వ్యవసాయ భూములకు గాను 6 వారాల్లో పునరావాస ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకు రైతులను వారి భూముల నుంచి ఖాళీ చేయించొద్దని ఆదేశించింది. అనంతగిరి రిజర్వాయర్‌ నిమిత్తం నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ చేపట్టారంటూ సీహెచ్‌.లక్ష్మారెడ్డి మరో 29 మంది రైతులు 2018లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ సూరేపల్లి నంద విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘అనంతగిరి రిజర్వాయర్‌ కోసం వేర్వేరు చోట్ల 69 ఎకరాలు, 257 ఎకరాల భూసేకరణ నిమిత్తం 2017 జనవరి 1న, మే 16న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. కానీ భూముల మార్కెట్‌ విలువలను సవరించకపోవడంపై కొంత మంది అభ్యంతరాలు లేవనెత్తినా కలెక్టర్‌ పట్టించుకోలేదు. అధికారులు ప్రకటించిన పరిహారాన్ని మరింత పెంచాలంటూ రైతులు చేసిన అభ్యంతరాలను భూసేకరణ అథారిటీకి పంపాలని అధికారులను కోరినా పరిగణనలోకి తీసుకోలేదు. ఇంకా పునరావాస ప్రయోజనాలు కల్పించకుండానే పిటిషనర్ల పక్క భూముల్లో పనులు మొదలుపెట్టారు.

అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసుల ద్వారా బెదిరించారు’ అని తెలిపారు. అధికారుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అనంతగిరిలో 69 ఎకరాలు, రేపాకలో 35.22 ఎకరాలకు పరిహారం ప్రకటించి చెల్లించారని, ఈ భూముల్లో రిజర్వాయర్‌ బండ్‌ భాగాన్ని పూర్తి చేశారని తెలిపారు. పునరావాస పునర్నిర్మాణంలో భాగంగా 599 నిర్మాణాలకు పరిహారం అందజేశారన్నారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి గతంలో పరిహారం చెల్లించిన భూములను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పునరావాస పరిహారం చెల్లించామని అధికారులు చెబుతున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు. పరిహారం చెల్లించే వరకు భూములను ఖాళీ చేయించరాదంటూ హైకోర్టు 2018లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, అయినా ఉల్లంఘించడంతో కోర్టు ధిక్కరణ కింద శిక్ష విధించిందన్నారు. ఈ ఉత్తర్వులు ఇప్పటికీ అమల్లో ఉన్నందున పరిహారం చెల్లించేదాకా రైతులను ఖాళీ చేయించరాదని ఆదేశించారు. ఈ ఉత్తర్వులు అందిన ఆరు వారాల్లో వ్యవసాయ భూములకు పునరావాస ప్రయోజనాలు కల్పించాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని