ఈవీఎంల తనిఖీకి 11 మంది అభ్యర్థుల దరఖాస్తు

ఈవీఎంల క్రాస్‌ వెరిఫికేషన్‌ కోసం దేశ వ్యాప్తంగా 11 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) వెల్లడించింది.

Published : 21 Jun 2024 05:07 IST

ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణలో ఒకరు 
ఎన్నికల పిటిషన్ల ఆధారంగా పరిశీలిస్తామని ఈసీఐ వెల్లడి

ఈనాడు, దిల్లీ: ఈవీఎంల క్రాస్‌ వెరిఫికేషన్‌ కోసం దేశ వ్యాప్తంగా 11 మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) వెల్లడించింది. ఇందులో 8 లోక్‌సభ స్థానాల పరిధిలో 92, 3 అసెంబ్లీ స్థానాల పరిధిలోని 26 పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించిన ఈవీఎంలను తనిఖీ చేయాలని వారు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం లోక్‌సభ నియోజకవర్గంలోని బొబ్బిలి, నెల్లిమర్ల అసెంబ్లీ పరిధిలోని ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌కు సంబంధించిన ఈవీఎంలను తనిఖీ చేయాలని కోరుతూ వైకాపా అభ్యర్థి దరఖాస్తు చేసినట్లు పేర్కొంది. అలాగే గజపతినగరం అసెంబ్లీ స్థానంలోని ఒక పోలింగ్‌స్టేషన్, ఒంగోలు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని 12 పోలింగ్‌ స్టేషన్లలో ఈవీఎంలను పరిశీలించాలని అక్కడి వైకాపా అభ్యర్థుల నుంచి వినతులు అందినట్లు తెలిపింది. అలాగే తెలంగాణలోని జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నారాయణ్‌ఖేడ్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఏడు, జహీరాబాద్‌లో ఏడు, ఆందోల్‌ సెగ్మెంట్‌లో 6 పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించి భాజపా అభ్యర్థి దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ లోక్‌సభ పరిధిలో 4, హరియాణాలోని కర్నాల్, ఫరీదాబాద్‌ లోక్‌సభ పరిధిలో 6 పోలింగ్‌స్టేషన్ల ఈవీఎంలను తనిఖీ చేయాలని కాంగ్రెస్‌ అభ్యర్థులు, మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ పరిధిలోని 40 పోలింగ్‌స్టేషన్లు, తమిళనాడు పరిధిలోని వేలూర్‌ పరిధిలో 6 ఈవీఎంలను తనిఖీ చేయాలని భాజపా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించింది. విరుధ్‌నగర్‌లోని 14 స్టేషన్ల ఈవీఎంలను తనిఖీ చేయాలని డీఎండీకే అభ్యర్థి దరఖాస్తు చేసినట్లు తెలిపింది. అలాగే ఒడిశాలోని ఝార్స్‌గూడ అసెంబ్లీ పరిధిలో 13 స్టేషన్లకు సంబంధించి బీజేడీ అభ్యర్థి వినతి ఇచ్చినట్లు చెప్పింది. కోర్టుల్లో దాఖలయ్యే ఎన్నికల పిటిషన్ల స్థితిగతుల ఆధారంగా వీటిని తనిఖీ చేపడతామని ఈసీఐ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని