శ్మశానవాటికనూ కబళించేశారు..!

ఆ శ్మశానవాటికకు రక్షణ కరవైంది. ఆక్రమణదారులు బరితెగించి రూ.250 కోట్ల విలువైన నాలుగున్నర ఎకరాల శ్మశానవాటిక స్థలాన్ని కబళించేస్తున్నారు.

Updated : 21 Jun 2024 05:24 IST

రూ. 250 కోట్ల విలువైన 4.5 ఎకరాల ఆక్రమణ
మృతురాలి అంత్యక్రియలు వాయిదా

షేక్‌పేటలో శ్మశానవాటిక స్థలాన్ని ఆక్రమించి ఏర్పాటుచేసిన ఇనుపరేకుల కంచె

షేక్‌పేట, న్యూస్‌టుడే: ఆ శ్మశానవాటికకు రక్షణ కరవైంది. ఆక్రమణదారులు బరితెగించి రూ.250 కోట్ల విలువైన నాలుగున్నర ఎకరాల శ్మశానవాటిక స్థలాన్ని కబళించేస్తున్నారు. చివరికి శ్మశానవాటికకు వెళ్లే దారినీ వదలకపోవడంతో గురువారం మృతి చెందిన ఓ మహిళ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు శుక్రవారానికి వాయిదా వేసుకున్నారు.నగరం నడిబొడ్డున ఐటీ కారిడార్ల సమీపంలో.. షేక్‌పేట ఓయూ కాలనీ చెంతన ఈ బాగోతం చోటుచేసుకుంది. 

శతాబ్దాల నాటి శ్మశానవాటిక..

షేక్‌పేటలో ఓయూ కాలనీ వంతెన సమీపంలో బుల్కాపూర్‌ నాలా ఒడ్డున సర్వే నంబరు 327లో శతాబ్దాల నాటి శ్మశానవాటిక 5.20 ఎకరాల్లో విస్తరించి ఉంది. దాని పక్కనే ప్రైవేటు వ్యక్తులు స్థిరాస్తి వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. శ్మశానవాటికకు రక్షణ గోడలు లేకపోవడంతో అందులోని నాలుగున్నర ఎకరాల వరకు ఇప్పటికే ఆక్రమణకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. దీని విలువ రూ.250 కోట్ల వరకు ఉంటుంది. కబ్జాదారులు శ్మశానవాటికలోని ఆక్రమించిన స్థలానికి కంచె నిర్మించారు. స్థానికులు ప్రశ్నించగా.. గూండాలతో భయపెట్టి పంపేశారు. క్రమేణా దారిని సైతం మూసేశారు. స్థానిక మహిళ ఒకరు అనారోగ్యంతో గురువారం మృతి చెందగా.. దారి లేకపోవడంతో ఆమె అంత్యక్రియలను బంధువులు శుక్రవారానికి వాయిదా వేశారు. దీనిపై జీహెచ్‌ఎంసీ ఉపకమిషనర్‌ ప్రశాంతిని వివరణ కోరగా.. ఆ స్థలాన్ని పరిశీలించి కబ్జాలను తొలగిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని