సంక్షిప్త వార్తలు (8)

మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్‌ శాఖ సంచాలకురాలు దివ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

Updated : 22 Jun 2024 06:57 IST

ప్రజావాణికి 575 అర్జీలు

సోమాజిగూడ, న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్‌ శాఖ సంచాలకురాలు దివ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 575 అర్జీలు అందగా.. రెవెన్యూ-185, హౌసింగ్‌-64, పౌరసరఫరాలశాఖ-50, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి- 43, హోంశాఖ-42, ఇతర శాఖలకు-191 వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

  • రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని వినతిపత్రం అందజేశారు. 
  • రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలల తరబడి నిలిచిన పెండింగ్‌ వేతనాలను చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ విన్నవించింది. 
  • ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇచ్చోడ మండల పరిధిలో పలు గ్రామాలకు రోడ్లు, విద్యుత్తు సౌకర్యం లేదని, ఐటీడీఏ నుంచి నిధులు మంజూరు చేయించుకున్నా అటవీ అధికారులు అనుమతులు ఇవ్వడంలేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. 
  • బేగంపేట మాతాజీనగర్‌ సమీపంలోని ఫ్రైడ్‌ ఇండియా వెంచర్‌లోని బాలాజీనగర్‌ ప్లాట్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆరేళ్ల కిందట 200 పైగా ప్లాట్లను కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించారు. ఇటీవల అనుమతులు లేవంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు ఇళ్లను కూల్చివేశారని ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఇక జోన్‌-1లో బదిలీలు.. 2లో పదోన్నతులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మల్టీ జోన్‌-1(వరంగల్‌) పరిధిలోని 19 జిల్లాల్లో పదోన్నతుల ప్రక్రియ ముగియడంతో ఇక అక్కడ సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) బదిలీల ప్రక్రియ మొదలుకానుంది. ఈ జోన్‌ పరిధి పాఠశాలల్లోని ఎస్జీటీలు స్కూల్‌ అసిస్టెంట్లుగా, పీఎస్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతి పొంది సంబంధిత పాఠశాలల్లో చేరిన సంగతి తెలిసింది. దీంతో ఆ ఖాళీల భర్తీకి మిగిలిన ఎస్జీటీలకు బదిలీ అవకాశం ఇవ్వనున్నారు. అందుకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ మొదలైంది. మరోవైపు మల్టీ జోన్‌-2(హైదరాబాద్‌) పరిధి పాఠశాలల్లోని (రంగారెడ్డి జిల్లా మినహా) ఎస్జీటీలు, భాషా పండితులు, పీఈటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇచ్చేందుకు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ శనివారం ప్రారంభం కానుంది.


చిమ్మపూడి ఆధ్వర్యంలో పౌరాణిక రంగస్థల నాటక పద్యాల పోటీలు

నాగోలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని బాలలు, యువతకు పౌరాణిక రంగస్థల నాటక పద్యాలపై పోటీలు నిర్వహించేందుకు సంకల్పించినట్లు చిమ్మపూడి ఫౌండేషన్‌ అధ్యక్షుడు చిమ్మపూడి శ్రీరామమూర్తి తెలిపారు. అభ్యర్థులు భావరాగ యుక్తంగా ఏవైనా 2 పద్యాలు(సోలో) పాడాల్సి ఉంటుందన్నారు. 8, 9, 10 తరగతుల వారు జూనియర్లుగా, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు సీనియర్లుగా పోటీల్లో పాల్గొంటారన్నారు. రెండు విభాగాల్లోనూ ప్రథమ, ద్వితీయ శ్రేణి వారికి నగదు బహుమతి, జ్ఞాపిక, పుస్తకాలు ప్రదానం చేస్తామన్నారు. జులై చివరి వారంలో జరిగే ఈ పోటీల వేదిక, తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. జులై 2లోగా 97041 77270 నంబరుకు ఫోన్‌ చేసి తమ పేరును ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. వాటిని పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.


డిమాండ్ల పరిష్కారానికి ఉద్యమం
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస 

ఈనాడు, హైదరాబాద్‌: నాలుగు పెండింగు డీఏల మంజూరు, ఆరోగ్య పథకంలో మార్పులు, ఇతర సమస్యల పరిష్కారానికి త్వరలోనే ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస తెలిపింది. శుక్రవారం ఐకాస ఛైర్మన్‌ కె.లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి సుభాకర్‌రావు ఇతర నేతలు తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘పెండింగు డీఏలు ఇవ్వాలని, అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని ఆరు నెలలుగా మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అయినా తమ విన్నపాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యమ కార్యాచరణ చేపడతాం’’ అని లక్ష్మయ్య పేర్కొన్నారు.


నేడు 6 జిల్లాల్లో భారీ వర్షాలు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శనివారం 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. నిర్మల్‌ జిల్లా కడెం మండల కేంద్రంలో 2.6 సెం.మీ. వర్షపాతం నమోదయింది. 


ఆర్టీసీకి బడ్జెట్‌లో 3 శాతం నిధులు కేటాయించాలి
సీఎంకు ఎస్‌డబ్ల్యూయూ విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల పెండింగ్‌ సమస్యల్ని పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కార్మిక సంఘం స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఎస్‌డబ్ల్యూయూ) విజ్ఞప్తిచేసింది. సీఎంను శుక్రవారం సంఘ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీలో కార్మిక సంఘాలను అనుమతించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఆర్టీసీకి 3 శాతం నిధులు కేటాయించాలని విన్నవించారు. 2013 వేతన సవరణ బకాయిలకు సంబంధించి మిగతా డబ్బులను చెల్లించాలని.. ఆర్టీసీకి అదనపు బస్సులు కొనుగోలు చేయాలని కోరారు. రిటైర్డ్‌ ఉద్యోగులకు తెల్ల రేషన్‌ కార్డులు, ఆసరా పింఛన్లు ఇవ్వాలని అడిగారు.


రుణమాఫీకి రేషన్‌కార్డును ప్రామాణికం చేయొద్దు 

రాష్ట్ర ప్రభుత్వానికి ఏఈవో వినతి

ఈనాడు, హైదరాబాద్‌: రైతు రుణమాఫీకి రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవద్దని, దీనివల్ల ఉద్యోగుల కుటుంబాలు నష్టపోతాయని నల్గొండ జిల్లా నకిరేకల్‌ మండలం పాలెం గ్రామానికి చెందిన వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో) కల్లెపల్లి పరశురాములు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. శుక్రవారం ఈ మేరకు సీఎం కార్యాలయంలో ఆయన వినతిపత్రం సమర్పించారు. ‘‘మా కుటుంబంలో ముగ్గురం అన్నదమ్ములం. నేను ఒక్కడినే కిందిస్థాయి ఉద్యోగం చేస్తున్నా. మిగిలిన ఇద్దరు తమ్ముళ్లకు ఉద్యోగాలు, సొంత ఇళ్లు లేవు. వారు కూలీ పనులు చేస్తున్నారు. నాకు ఉద్యోగం ఉందని నా తల్లిదండ్రులకు రేషన్‌కార్డు తొలగించారు. పెన్షన్‌ ఇవ్వడం లేదు. నిరుద్యోగుల మాదిరే మా తల్లిదండ్రులకు రేషన్‌ కార్డు ఇవ్వాలి. పింఛన్, రుణమాఫీ, ఇతర పథకాలను వర్తింపజేయాలి’’ అని పరశురాములు వినతిపత్రంలో అభ్యర్థించారు.


రుణమాఫీ నిర్ణయానికి కృతజ్ఞతలు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అభినందిస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, టెస్కాబ్‌ ఛైర్మన్‌ రవీందర్‌రావు, సత్తయ్య తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: రైతులకు రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందంటూ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ పాలకవర్గం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపింది. పాలకవర్గ సభ్యులు శుక్రవారం మంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా కృతజ్ఞతలు తెలపాల్సిందిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సహకార బ్యాంకు ద్వారా రుణం తీసుకున్న 7,74,833 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో తాండూరు ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి, టెస్కాబ్‌ ఛైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, ఉపాధ్యక్షుడు కె.సత్తయ్య, మెదక్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ డీసీసీబీ ఛైర్మన్లు చిట్టి దేవేందర్‌రెడ్డి, అడ్డి భోజారెడ్డి, కొరమోని వెంకటయ్య, వరంగల్‌ డీసీసీబీ డైరెక్టర్‌ ఉపేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని