చెరువుల ఆక్రమణల గుర్తింపునకు క్షేత్రస్థాయి సర్వే

గ్రేటర్‌ హైదరాబాద్, బాహ్య వలయ రహదారి పరిధిలో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటల్లో సమగ్ర క్షేత్రస్థాయి సర్వే చేయిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Published : 22 Jun 2024 04:35 IST

టీజీఆర్‌ఏసీ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 
920 చెరువుల్లో 282 పూర్తిగా కబ్జా: టీజీఆర్‌ఏసీ

టీజీఆర్‌ఏసీ నివేదికను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చిత్రంలో సంస్థ అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్, బాహ్య వలయ రహదారి పరిధిలో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటల్లో సమగ్ర క్షేత్రస్థాయి సర్వే చేయిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 2014-23 మధ్యకాలంలో కబ్జాకు గురైన చెరువులు, కుంటలకు సంబంధించిన నివేదికను తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (టీజీఆర్‌ఏసీ) ఉప ముఖ్యమంత్రికి అందజేసింది. శుక్రవారం అంబేడ్కర్‌ సచివాలయంలో భట్టి ఆ నివేదికపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. అన్యాక్రాంతమైన తటాకాలను పూర్వస్థితికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్, బాహ్య వలయ రహదారి పరిధిలో మొత్తం 920 చెరువులు, కుంటలు ఉండగా వాటిలో 282 పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయని, 209 పాక్షికంగా అన్యాక్రాంతమయ్యాయని టీజీఆర్‌ఏసీ విశ్లేషించింది. ఉపగ్రహ చిత్రపటాలు, సర్వే ఆఫ్‌ ఇండియా టోపోషీట్లు, రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఆ సంస్థ.. ఆక్రమణలను గుర్తించింది. ఈ సమావేశంలో టీజీఆర్‌ఏసీ సంస్థ అదనపు డైరెక్టర్‌ పి.మనోహర్, సైంటిఫిక్‌ అధికారి ఎస్‌.బాలకృష్ణ, పి.ప్రకాశ్, అశ్విని కుమార్, ఏవో ఆర్‌.ఎన్‌.చారి పాల్గొన్నారు.


నివేదికలోని అంశాలు

  • గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 2014కు ముందు 417 చెరువులు, కుంటలు ఉన్నాయి. తర్వాత వాటిలో 182 పూర్తిగా, 76 పాక్షికంగా కబ్జా అయ్యాయి. గ్రేటర్‌ నుంచి అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో 503 చెరువులు, కుంటలు ఉండగా.. వీటిలో 62 పూర్తిగా, 102 పాక్షికంగా ఆక్రమణల పాలయ్యాయి. 
  • 2014-23 మధ్య గ్రేటర్‌ పరిధిలోని 417లో కబ్జాదారులు పాత వాటికి తోడు 11 చెరువులను పూర్తిగా, 7 పాక్షికంగా ఆక్రమించారు. గ్రేటర్‌ నుంచి అవుటర్‌ పరిధిలోని 503 తటాకాల్లో పాత వాటికి తోడు 27 పూర్తిగా, 24 పాక్షికంగా అన్యాక్రాంతం చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు