అడ్వొకేట్‌ కమిషన్‌ ముందు హాజరు కండి

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి విజయం సాధించిన గంగుల కమలాకర్‌ ఎన్నికపై దాఖలు చేసిన పిటిషన్‌లో అడ్వొకేట్‌ కమిషన్‌ ముందు హాజరు కావాలని భాజపా అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్‌కు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated : 22 Jun 2024 05:50 IST

లేదంటే గంగులపై ఎన్నికల పిటిషన్‌ను మూసివేస్తాం
బండి సంజయ్‌కు హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి విజయం సాధించిన గంగుల కమలాకర్‌ ఎన్నికపై దాఖలు చేసిన పిటిషన్‌లో అడ్వొకేట్‌ కమిషన్‌ ముందు హాజరు కావాలని భాజపా అభ్యర్థి, ప్రస్తుత ఎంపీ బండి సంజయ్‌కు శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అడ్వొకేట్‌ కమిషన్‌ ముందు హాజరై సాక్ష్యం ఇవ్వని పక్షంలో గంగుల కమలాకర్‌పై దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను మూసివేస్తామని తేల్చిచెబుతూ తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి తెరాస (ప్రస్తుతం భారాస) అభ్యర్థి గంగుల కమలాకర్‌ ఎన్నికను సవాల్‌ చేస్తూ 2019లో బండి సంజయ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో ఇరుపక్షాల సాక్ష్యాల నమోదుకు మాజీ జిల్లా జడ్జి కె.శైలజను అడ్వొకేట్‌ కమిషన్‌గా హైకోర్టు నియమించింది. అడ్వొకేట్‌ కమిషన్‌ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి బండి సంజయ్‌ పలుమార్లు గడువు తీసుకున్నారు. ఈ విషయమై గత ఏడాది సెప్టెంబరులో హైకోర్టు జరిమానా కూడా విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల పిటిషన్‌పై జస్టిస్‌ జి.రాధారాణి శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. బండి సంజయ్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అధికార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని మరికొంత గడువు కావాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి అడ్వొకేట్‌ కమిషన్‌ ముందు హాజరు కావడానికి బండి సంజయ్‌కు మరో అవకాశం ఇస్తూ విచారణను వాయిదా వేశారు. ఒకవేళ హాజరుకాని పక్షంలో ఎన్నికల పిటిషన్‌పై విచారణను మూసివేస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు