రైస్‌ మిల్లింగ్‌ సామర్థ్యం పెరగాలి

రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా రైస్‌ మిల్లుల సామర్థ్యాన్ని పెంచుకోవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైస్‌ మిల్లర్లకు సూచించారు.

Published : 22 Jun 2024 04:36 IST

పీడీఎస్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించొద్దు
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా రైస్‌ మిల్లుల సామర్థ్యాన్ని పెంచుకోవాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైస్‌ మిల్లర్లకు సూచించారు. రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్‌లో ‘16వ అంతర్జాతీయ రైస్‌ అండ్‌ గ్రెయిన్స్‌ టెక్‌ ఎక్స్‌పో- 2024’ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- రైస్‌ మిల్లింగ్, నాణ్యమైన బియ్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా మార్చడానికి మిల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ‘కోదాడ, హుజూర్‌నగర్‌ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి నల్గొండ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించా. ఇవి రైస్‌ మిల్లులకు కేంద్రాలు. మీ సమస్యలపై నాకు అవగాహన ఉంది. మిల్లింగ్‌ ఛార్జీలు, రవాణా ఛార్జీల వంటి సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తా’ అని ఆయన హామీఇచ్చారు.

వానాకాలంలో 1.7 కోట్ల టన్నుల ఉత్పత్తి

‘ధాన్యం సేకరణలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. వర్షాకాలంలో 1.70 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తవుతుంది. ‘రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణ తన బిరుదును నిలుపుకొంటుంది. గత వానాకాలం దిగుబడి 1.48 కోట్ల టన్నులకు అదనంగా మరో 22 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి పెరుగుతుంది. అందుకు అనుగుణంగా మిల్లింగ్‌ సామర్థ్యం, పరిజ్ఞానం పెంచుకోవాలి’అని ఉత్తమ్‌ సూచించారు. అయితే నిబంధనలను ఉల్లంఘించి ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) బియ్యాన్ని దారి మళ్లించే చర్యల్ని సహించేది లేదని హెచ్చరించారు. అధిక ధరలకు ఎగుమతి చేసేందుకు కొందరు మిల్లర్లు పీడీఎస్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి రీసైక్లింగ్‌ చేస్తున్నారని తప్పుబట్టారు. కిలో రూ.40కి బియ్యాన్ని కొనుగోలు చేసి పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందనీ..ఈ బియ్యాన్ని పక్కదారి పట్టించొద్దని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని