బదిలీలు, పదోన్నతులకు గిరిజన ఉపాధ్యాయుల ఎదురుచూపులు

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న గిరిజన ఉపాధ్యాయులు ఐదేళ్లుగా బదిలీలు, పదోన్నతులకు నోచుకోవడం లేదు.

Updated : 22 Jun 2024 06:45 IST

నియామకానికి నోచుకోని మల్టీజోన్‌ అథారిటీ 

ఉట్నూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న గిరిజన ఉపాధ్యాయులు ఐదేళ్లుగా బదిలీలు, పదోన్నతులకు నోచుకోవడం లేదు. జిల్లా పరిషత్‌ యాజమాన్య ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల వ్యవహారం కొలిక్కి వచ్చినా గిరిజన సంక్షేమ శాఖల ఉపాధ్యాయుల విషయంలో స్పష్టత కొరవడింది. అడవి బిడ్డల్లో విద్యాభివృద్ధి లక్ష్యంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ఆధ్వర్యంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖల అధికారులు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలోని ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, మన్ననూరు ఐటీడీఏల్లో కలిపి మొత్తం 322 గిరిజన ఆశ్రమ, 1,400 గిరిజన ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు లక్ష మంది విద్యార్థులు ఉన్నారు. పీజీహెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీ రెగ్యులర్, కాంట్రాక్టు ఉపాధ్యాయులు కలిపి 5,500 మంది రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015, 2018లలో బదిలీలు చేపట్టారు. బదిలీల కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకునే వారే కరయ్యారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పెండింగ్‌లో మార్గదర్శకాల దస్త్రం.. 

గతంలో పీజీహెచ్‌ఎం పోస్టు జిల్లా క్యాడర్‌గా ఉండేది. అప్పుడు అపాయింటింగ్‌ అథారిటీగా జిల్లా కలెక్టర్‌ ఉండేవారు. కానీ గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317తో పీజీహెచ్‌ఎం పోస్టు మల్టీజోన్‌ క్యాడర్‌గా మారింది. మల్టీజోన్‌ పోస్టు నియామక అథారిటీ ఎవరనేది తేల్చకపోవడంతో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు ఆటంకంగా మారింది. ఇప్పటికీ మల్టీజోన్‌ అపాయింటింగ్‌ అథారిటీ నియామకం కాలేదు. గిరిజన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలకు సంబంధించిన మార్గదర్శకాల దస్త్రం ప్రభుత్వం వద్ద కొంతకాలంగా పెండింగ్‌లో ఉంది. ఇంకా ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ రాకపోవడంతో గిరిజన ఉపాధ్యాయ సంఘాల నాయకులు సీఎస్, మంత్రి సీతక్క, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులను కలిసి తమ గోడు విన్నవించారు. ఏళ్లుగా ఒకే దగ్గర పని చేయాల్సి వస్తోందని కొందరు వాపోతుంటే.. పదోన్నతులకు నోచుకోకుండానే పదవీ విరమణ పొందే దుస్థితి నెలకొందని మరికొందరు బాధపడుతున్నారు. వెంటనే కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని