మహిళలు.. ‘ప్రభుత్వ’ ఈవెంట్‌ మేనేజర్లు

తెలంగాణలో మహిళా శక్తి పథకం కింద ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ (ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌) బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 23 Jun 2024 05:49 IST

మహిళా సంఘాలకు అవకాశం
సర్కారు నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మహిళా శక్తి పథకం కింద ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ (ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌) బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇచ్చిన ఆదేశాల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ముందుగా ఈవెంట్‌ల నిర్వహణకు ముందుకొచ్చే మహిళా సంఘాలను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి వనరులను సమకూర్చాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, సభలు, సమావేశాల నిర్వహణను అధికారులు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలకు అప్పగిస్తున్నారు. దీనికయ్యే వ్యయాన్ని చెల్లిస్తున్నారు. మహిళా సంఘాల వారికి ఈ పనులను అప్పగించడం ద్వారా వారికి ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు మహిళా శక్తి ఉపాధి కార్యక్రమాల్లో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లను ఒక ఉపాధి మార్గంగా చూపింది. దీని కోసం మహిళా సంఘాలను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లు... జిల్లా, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి ఎంపికకు ఆదేశాలు ఇచ్చారు. మంచిర్యాల తదితర జిల్లాల్లో ఎంపిక ప్రక్రియ మొదలైంది 

శిక్షణ ఇలా...

మహిళా సంఘాల వారికి స్టేజి అలంకరణ, ఆతిథ్యం, స్క్రీన్లు, సౌండ్‌బాక్స్‌లు, వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ, కేటరింగ్‌ తదితర అంశాల్లో నిపుణులు శిక్షణ ఇస్తారు. అనంతరం అవసరమైన సామగ్రి సమకూర్చుకునేందుకు రుణసాయం లభిస్తుంది. రూ.15 లక్షల వరకు సాయం అందుతుంది.


ప్రభుత్వ కార్యకలాపాలు లేని సమయంలో...

శిక్షణ పూర్తయి వనరులు సమకూర్చుకున్న అనంతరం ఆయా మహిళా సంఘాల వారిని ప్రభుత్వ కార్యక్రమాల నిర్వాహకులుగా తీసుకుంటారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాలు, సదస్సులు, సమావేశాలకు ఈ సంఘాలే ఏర్పాట్లను చేస్తాయి. ప్రభుత్వ కార్యకలాపాలు లేని సమయంలో ఊళ్లలో జరిగే కార్యక్రమాల నిర్వహణను చేపట్టేందుకు వారికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని