నూతన చట్టాలపై అధ్యయనం చేయాలి

పాత చట్టాల స్థానంలో వస్తున్న నూతన చట్టాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవడానికి నిరంతరం అధ్యయనం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌పాల్‌ న్యాయవాదులకు సూచించారు.

Published : 23 Jun 2024 04:00 IST

న్యాయవాదుల శిక్షణ కార్యక్రమంలో జస్టిస్‌ సుజయ్‌పాల్‌

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి..
చిత్రంలో జ్యుడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ ఎం.రాజేందర్, జస్టిస్‌ పి.శ్యాం కోశీ, జస్టిస్‌ సుజయ్‌ పాల్‌

ఈనాడు, హైదరాబాద్‌: పాత చట్టాల స్థానంలో వస్తున్న నూతన చట్టాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవడానికి నిరంతరం అధ్యయనం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌పాల్‌ న్యాయవాదులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీ, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సంయుక్తంగా హైదరాబాద్‌లోని ఆర్‌బీవీఆర్‌ఆర్‌ పోలీసు అకాడమీలో న్యాయవాదులకు కొత్త క్రిమినల్‌ చట్టాలపై ఏర్పాటుచేసిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ సుజయ్‌పాల్‌ మాట్లాడుతూ.. సీఆర్‌పీసీ స్థానంలో భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌), ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌), ఎవిడెన్స్‌ చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం(బీఎస్‌ఏ) జులై నుంచి అమలులోకి వస్తున్నాయని, న్యాయవాదులు ఈ చట్టాలు, వాటిలోని నిబంధనలను బాగా చదివి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కొత్త చట్టాలపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన బార్‌ కౌన్సిల్, జ్యుడిషియల్‌ అకాడమీలను అభినందించారు. హైకోర్టు మరో న్యాయమూర్తి, జ్యుడిషియల్‌ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్‌ పి.శ్యాం కోశీ మాట్లాడుతూ.. కొత్త క్రిమినల్‌ చట్టాలు అమలులోకి వస్తున్న నేపథ్యంలో న్యాయవాదులపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవడానికి ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదులు కొత్త చట్టాల గురించి తెలుసుకుని కేసుల పరిష్కారంలో కోర్టులకు సహకరించాలని కోరారు. పోలీసులు, ప్రాసిక్యూటర్లతోపాటు న్యాయవాదులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించడానికి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని ఏర్పాటు చేస్తామని జ్యుడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ మంగారి రాజేందర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జ్యుడిషియల్‌ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌.వెంకటరాం, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు కె.లక్ష్మణ్, డి.జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని