రైతును రాజుగా చేయడమే లక్ష్యం

సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడంతోపాటు, అప్పుల ఊబిలో ఉన్న అన్నదాతలను కాపాడుకుంటూ రైతును రాజుగా చేయడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Published : 24 Jun 2024 04:18 IST

రెండు నెలల్లోగా రూ.31 వేల కోట్ల రుణమాఫీ: పొంగులేటి

ఆరెంపులలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పూలు జల్లుతున్న మాజీ సర్పంచులు బండి జగదీశ్, చింతమల్ల రవి. చిత్రంలో రాయల నాగేశ్వరరావు

కూసుమంచి, న్యూస్‌టుడే: సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడంతోపాటు, అప్పుల ఊబిలో ఉన్న అన్నదాతలను కాపాడుకుంటూ రైతును రాజుగా చేయడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రజల చెంతకే శీనన్న’ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, ఖమ్మం గ్రామీణం మండలాల్లో ఆదివారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల హామీలను నెరవేర్చే క్రమంలో భాగంగా రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయనున్నాం. చరిత్రలో నిలిచిపోయే ఈ కార్యక్రమం ద్వారా వచ్చే రెండు నెలల్లోగా అన్నదాతలంతా రుణ విముక్తులవుతారు. గత ప్రభుత్వం చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులు, వడ్డీలు తీరుస్తూనే.. ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. తల తాకట్టు పెట్టయినా సరే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. రానున్న కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తాం. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే వేల ఉద్యోగాల కల్పన పూర్తిచేసింది. గ్రూప్‌-4 నుంచి గ్రూప్‌-1 వరకు నోటిఫికేషన్లు ఇచ్చాం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నాం. ఇంత చేస్తున్నా గత ప్రభుత్వ పెద్దలు విమర్శలు చేస్తున్నారు. మా ప్రభుత్వ నిర్ణయాలను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, అడ్డంకులు ఎదురైనా.. మాట తప్పేది, మడమ తిప్పేది లేదు’’ అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. రుణమాఫీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఖమ్మం గ్రామీణం మండలంలోని ఆరెంపులలో మాజీ సర్పంచులు పొంగులేటిపై పూలు జల్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని