చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగొచ్చాడు!

అతడు రైలు కింద పడి చనిపోయాడని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధం చేశారు. అంతలో వారికి అతడు ఫోన్‌ చేసి.. ‘నేను బతికే ఉన్నా.

Published : 24 Jun 2024 07:04 IST

బషీరాబాద్, న్యూస్‌టుడే: అతడు రైలు కింద పడి చనిపోయాడని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధం చేశారు. అంతలో వారికి అతడు ఫోన్‌ చేసి.. ‘నేను బతికే ఉన్నా. చనిపోయింది మరో వ్యక్తి’ అని చెప్పాడు. దీంతో అప్పటిదాకా కన్నీరుమున్నీరైనవారు ఆనందంలో మునిగిపోయారు. ఈ ఘటన ఆదివారం వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలోని నవాంద్గీ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాంద్గీ గ్రామానికి చెందిన ఎల్లప్పకు భార్య విమలమ్మ, ఇద్దరు కుమారులున్నారు. ఎల్లప్ప బషీరాబాద్‌లో పశువుల కాపరిగా పనిచేసేవాడు. అక్కడ రెండు రోజుల క్రితం పని మానేసి.. తాండూరుకు వెళ్లి సిమెంటు బస్తాలు మోసే హమాలీగా చేరాడు. అక్కడే పనిచేసే ఓ గుర్తుతెలియని వ్యక్తి, ఎల్లప్ప కలిసి శనివారం సాయంత్రం తాండూరులో మద్యం తాగారు. ఎల్లప్ప ఫుట్‌పాత్‌పైనే మత్తులోకి జారుకున్నాడు. అతడి వద్ద ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్‌ను ఆ వ్యక్తి తస్కరించి వెళ్లిపోయాడు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొని అతడు మృతి చెందాడు. అక్కడ లభించిన సెల్‌ఫోన్‌లోని కాల్‌ డేటా ఆధారంగా అతడిని ఎల్లప్పగా భావించి కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు సమాచారం అందించారు. మృతదేహం ముక్కలై ఉండటంతో.. ఎల్లప్పదేనని పొరపాటు పడి కుటుంబ సభ్యులు నవాంద్గీకి తీసుకొచ్చారు. ఎల్లప్ప చనిపోయాడని గ్రామస్థుల ద్వారా సిమెంటు కంపెనీ వారికి తెలిసింది. అయితే అక్కడే పనిచేస్తున్న బషీరాబాద్, నవాంద్గీకి చెందిన కొందరు హమాలీలు ఆదివారం ఉదయం ఎల్లప్పను గమనించారు. అతని వద్దకు వెళ్లి మాట్లాడగా.. అసలు విషయం బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులకు ఎల్లప్ప ఫోన్‌ చేసి అంత్యక్రియల్ని ఆపేయాలని చెప్పాడు. అనంతరం స్వగ్రామానికి చేరుకున్నాడు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని వికారాబాద్‌ రైల్వే పోలీసులకు అప్పగించారు. మృతదేహం ముక్కలు కావడంతో సరిగ్గా గుర్తుపట్టలేక ఇలా జరిగిందని రైల్వే పోలీసులు పేర్కొంటున్నారు. వికారాబాద్‌ రైల్వే ఎస్‌ఐ శంకరయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని