నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం దిల్లీ వెళ్లనున్నారు. సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు ఆయన దిల్లీలోనే ఉంటారు.

Published : 24 Jun 2024 04:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఉదయం దిల్లీ వెళ్లనున్నారు. సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు ఆయన దిల్లీలోనే ఉంటారు. లోక్‌సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు సీఎం వెళ్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చలు జరుపుతారని సమాచారం. మంత్రివర్గ విస్తరణ జులై మొదటి వారంలో ఉండవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. కొందరు ఆశావహులు దిల్లీలో పార్టీ నేతల ద్వారా పైరవీలు చేయిస్తున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా సైతం ఉన్నారు. దీని పదవీకాలం మూడేళ్లు. ఇది ఈ నెల 27తో పూర్తవుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపైనా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్ర నేత రాహుల్‌ గాంధీలతో ఆయన చర్చించవచ్చని అంచనా. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్ర నేతలంతా బిజీగా ఉంటారని, రాష్ట్రంలో పదవుల భర్తీపై ఎంతవరకు నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రశ్నార్థకమేనని సీనియర్‌ నేత ఒకరు పేర్కొన్నారు. మరోవైపు, రైతులకు రూ.2 లక్షల వరకూ పంటరుణాలు మాఫీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీనికి అవసరమైన రూ.31 వేల కోట్లను రుణాలుగా సేకరించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో లేదా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ కావచ్చన్న చర్చ కూడా సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని