సంక్షిప్త వార్తలు (9)

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఆదివారం వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated : 24 Jun 2024 05:00 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉపాధ్యాయ సంఘాల నేతల భేటీ

సీఎం రేవంత్‌రెడ్డితో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్‌ పరిషత్‌ నేతలు విజయ్‌కుమార్, నరసింగరావు, జగదీశ్, నరసింహులు. చిత్రంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఆదివారం వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. గత 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అప్‌గ్రేడేషన్‌ సమస్యను పరిష్కరించడంతో సీఎంకు ఉపాధ్యాయ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.


కేంద్ర మంత్రి అమిత్‌షాతో ఇన్‌ఛార్జి గవర్నర్‌ భేటీ

దిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ రాధాకృష్ణన్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆదివారం దిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి గవర్నర్‌ పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. వారు తెలంగాణ, ఝార్ఖండ్, పుదుచ్చేరికి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలు, ఇతర విషయాలపై చర్చించారు.


సీట్లు 1,500.. దరఖాస్తులు 15వేలు

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి  దరఖాస్తు గడువు శనివారం రాత్రితో ముగిసింది. 1500 సీట్లకు గాను 15 వేల దరఖాస్తులు వచ్చినట్లు ఆర్జీయూకేటీ వీసీ వెంకటరమణ తెలిపారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను జులై 3న వెల్లడిస్తామన్నారు. 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి, ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు.


తడిసి ముద్దయిన హైదరాబాద్‌
రంగారెడ్డి, కరీంనగర్‌ జిల్లాల్లోనూ వర్షాలు 

ఈనాడు, హైదరాబాద్‌: భారీ వర్షాలకు ఆదివారం హైదరాబాద్‌ తడిసి ముద్దయింది. రాష్ట్రంలోనే అత్యధికంగా చార్మినార్‌ మండల పరిధిలో 7.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌ జిల్లా పరిధి ఆసిఫ్‌నగర్‌లో 6.9, నాంపల్లి 6.9, గోల్కొండ 5.7, అంబర్‌పేట 5.7, బహదూర్‌పురలో 5.7 సెం.మీ. భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై వరదలు పారాయి. అలాగే కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలంలో 5.2, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో 4.9, కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలంలో 4.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ పేర్కొంది.


నిమ్స్‌కు చెంచు మహిళ ఈశ్వరమ్మ తరలింపు

నాగర్‌కర్నూల్, న్యూస్‌టుడే: పాశవిక దాడికి గురై చికిత్స పొందుతున్న చెంచు మహిళ ఈశ్వరమ్మను ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కొల్లాపూర్‌ మండలంలోని మొలచింతలపల్లి గ్రామంలో ఆమెపై అదే గ్రామానికి చెందిన కొందరు అమానుషంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలైన సంగతి విదితమే. బాధితురాలిని ఈ నెల 19న నాగర్‌కర్నూల్‌ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం ఈశ్వరమ్మకు మూర్ఛ రావడంతో మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించినట్లు జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ రఘు తెలిపారు. ఆదివారం కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆమెను పరామర్శించారు.


దాల్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన కమిటీ సమావేశంలో తెలంగాణ దాల్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా వేములపల్లి వెంకన్నబాబు, అధ్యక్షుడిగా కోడుమూరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ప్రవీణ్‌కుమార్, వీరేందర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్, సహాయ కార్యదర్శిగా ఉదయ్‌భాస్కర్, కోశాధికారిగా అభిషేక్‌ అగర్వాల్‌ ఎన్నికయ్యారు.


గిరిజనులపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించాలి 

కొల్లాపూర్, కొల్లాపూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: గిరిజనులపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని జాతీయ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లిలోని చెంచు భ్రమరాంబ కాలనీలో నాగర్‌కర్నూల్‌ ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్, డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్, కొల్లాపూర్‌ ఆర్డీవో నాగరాజు, తహసీల్దార్‌ శ్రీకాంత్, సీఐ మహేశ్, ఎస్సై హృషికేశ్‌తో కలిసి ఆయన పర్యటించారు. చెంచు మహిళ ఈశ్వరమ్మపై దాడిని ప్రోత్సహించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డీఎస్పీని ప్రశ్నించారు. దోషులు ఎంతటివారైనా విడిచిపెట్టొద్దని చెప్పారు. అనంతరం హుస్సేన్‌నాయక్‌ విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజనులకు ఇచ్చిన భూములను ఇతరులు ఆక్రమించుకొని వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారన్నారు. తక్షణమే అర్హులైన చెంచు గిరిజనులందరికీ భూ పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భాజపా నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు, నాయకులు భరత్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.


నీటిపారుదలశాఖలో పదోన్నతుల జాబితా రూపకల్పనకు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదలశాఖలో ఇంజినీర్ల సీనియారిటీని ఖరారు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం 2022 మే 28న జారీ చేసిన 11656 మెమో ప్రకారం సీనియారిటీ జాబితాలను రూపొందించాలని ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌(అడ్మిన్‌)ను ఆదేశించింది. ఈ మేరకు తాజాగా శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఒక అంతర్గత ఉత్తర్వును జారీ చేశారు. ఏఈఈ/ఈఈలు, డీఈఈల కేటగిరీలో బ్యాచ్, మెరిట్‌కు ప్రాధాన్యం ఇస్తూ ప్యానెళ్ల వారీగా ఇంటిగ్రేటెడ్‌ సీనియారిటీని రూపొందించనున్నారు. వారం రోజుల్లో డీఈఈ నుంచి ఈఎన్సీల వరకు పదోన్నతులకు వీలుగా నివేదిక రూపొందించి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో నీటిపారుదలశాఖలో ఇన్నాళ్లూ తాత్కాలిక(అడ్‌హాక్‌) పద్ధతుల్లో కొనసాగిన పదోన్నతుల గందరగోళానికి తెరపడనుంది. 


ఆశా వర్కర్లకు పరీక్ష నిర్వహించొద్దు: సీపీఎం

ఈనాడు, హైదరాబాద్‌: ఆశా వర్కర్లకు ఎలాంటి పరీక్ష నిర్వహించవద్దని సీఎం రేవంత్‌రెడ్డిని సీపీఎం కోరింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలుతో పాటు ఆశా వర్కర్ల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం లేఖ రాశారు. ‘పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయంతో 28 వేల మంది ఆశాలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌ అమలుకు రాష్ట్ర అధికార యంత్రాంగం ఎందుకు ఉత్సాహం చూపుతుందో అర్థం కావడం లేదు. తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’ అని లేఖలో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని