హైదరాబాద్‌-విజయవాడ మార్గాన్ని వెంటనే విస్తరించండి

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా వెంటనే విస్తరించాలని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.

Published : 25 Jun 2024 08:24 IST

కేంద్ర మంత్రి గడ్కరీకి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వినతి
ఉప్పల్‌-నారపల్లి ఫ్లైఓవర్‌ నిర్మాణానికి కొత్త టెండర్లకు ఆదేశించారని వెల్లడి

సోమవారం దిల్లీలో నితిన్‌గడ్కరీతో సమావేశమైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా వెంటనే విస్తరించాలని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం గడ్కరీకి వినతిపత్రం సమర్పించిన తర్వాత విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘‘దేశంలోనే అత్యధిక ట్రాఫిక్‌ ఉండే మార్గాల్లో ఒకటైన హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని జీఎంఆర్‌ నిర్మాణ సంస్థ 2024కల్లా ఆరు వరుసలుగా విస్తరించాల్సి ఉంది. 17 యాక్సిడెంట్‌ స్పాట్లను సరిదిద్దడానికి రూ.370 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులతో శాశ్వత పరిష్కారం ఉండదని, ఈ మార్గాన్ని ప్రమాదరహితంగా మార్చాలంటే ఆరు వరుసలుగా విస్తరించాలని మరోసారి గడ్కరీని కోరాను. త్వరలోనే దీనిపై సమావేశం ఏర్పాటుచేసి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 16 ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కోరాను. ఉప్పల్‌-నారపల్లి ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరిన వెంటనే... సంబంధిత అధికారులతో మాట్లాడి పాత కాంట్రాక్టర్‌ను తొలగించి, కొత్త టెండర్లు పిలవాలని గడ్కరీ ఆదేశించారు’’ అని వెల్లడించారు. ఈ పర్యటనలో తాను కేంద్ర మంత్రులు భూపేందర్‌యాదవ్, కిషన్‌రెడ్డిలను కలిసి రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళతానన్నారు.

అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంజయ్‌ని కూడా వెంకట్‌రెడ్డి కలిశారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని