హైదరాబాద్‌లో తండ్రి.. బంగ్లాదేశ్‌లో కుమారుడు!

తన భార్య మరొకర్ని పెళ్లాడి, తన కుమారుడిని బంగ్లాదేశ్‌కు తీసుకెళ్లిందని.. అతన్ని ఎలాగైనా భారత్‌కు తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ తండ్రి కోరుతున్నారు.

Published : 25 Jun 2024 05:58 IST

కొడుకును పొరుగు దేశానికి తీసుకెళ్లిన తల్లి
భారత్‌కు రప్పించాలని తండ్రి అభ్యర్థన

ఈనాడు, హైదరాబాద్‌: తన భార్య మరొకర్ని పెళ్లాడి, తన కుమారుడిని బంగ్లాదేశ్‌కు తీసుకెళ్లిందని.. అతన్ని ఎలాగైనా భారత్‌కు తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ తండ్రి కోరుతున్నారు. వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన మాగాని తిరుపతి ముంబయిలో నిర్మాణ కూలీగా పనిచేసేవారు. 2016లో అక్కడ రియా అనే మహిళ పరిచయమైంది. స్థానికురాలినని నమ్మించడంతో ఆమెను వివాహం చేసుకున్నారు. 2017లో వీరికి కుమారుడు విశాల్‌ జన్మించాడు. తిరుపతి తన సొంతూరికి వచ్చిన సమయంలో రియా ఇంకొకర్ని వివాహమాడింది. విషయం తెలిసి ఆయన ముంబయికి వెళ్లగా.. బాబును తీసుకెళ్లాలని రియా చెప్పింది. ఆయన విశాల్‌ను హైదరాబాద్‌లోని బాలాపూర్‌కు తీసుకొచ్చి.. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. 2022లో విశాల్‌ను చూస్తానని రియా ఫోన్‌ చేసి చెప్పింది.

కుమారుడితో పాటు తిరుపతి ముంబయికి వెళ్లగా.. రియా భర్త, మరికొందరు ఆయనపై దాడి చేశారు. అప్పుడు ఐదేళ్ల వయసున్న కుమారుడు సహా ఆమె అదృశ్యమైంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. తెలిసిన వ్యక్తుల ద్వారా ఆరా తీయగా.. రియాది బంగ్లాదేశ్‌లోని జెస్సోర్‌ అని, కుమారుడిని అక్కడికి తీసుకెళ్లిందని తెలిసింది. ఆమె చెల్లెలి భర్త షఫీ ద్వారా విశాల్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు తిరుపతి ప్రయత్నించారు. ఇందుకు షఫీ పలుమార్లు డబ్బులు వసూలు చేశాడు. ఇటీవల రూ.లక్ష తీసుకున్నాడు. మరో రూ.3.5 లక్షలిస్తే బాబును అప్పగిస్తానని.. బంగ్లాదేశ్‌ సరిహద్దులకు రావాలని చెప్పాడు. కోల్‌కతా వెళ్లాక కుమారుడిని చూపించకపోవడంతో తిరుపతి వెనుదిరిగారు. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కరీంనగర్‌లో కలిసి సమస్యను వివరించినట్లు తిరుపతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని