ఎనిమిది నెలలుగా డబ్బులివ్వలేదు!

తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీ పథకం కోసం తమ వద్ద 108 గొర్రెల యూనిట్లను కొనుగోలు చేసిన పశుసంవర్ధకశాఖ అధికారులు 8 నెలలుగా తమకు రావాల్సిన  రూ.1.70 కోట్లను ఇప్పటి వరకు చెల్లించలేదని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన 10 మంది గొర్రెల విక్రేతలు పశుసంవర్ధక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచిఘోష్‌కు, తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ సుబ్బరాయుడికి సోమవారం ఫిర్యాదుచేశారు.

Published : 25 Jun 2024 04:52 IST

కర్నూలు జిల్లా గొర్రెల విక్రేతల ఆవేదన
108 యూనిట్లకు రూ.1.70 కోట్లు రావాలి
తెలంగాణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీ పథకం కోసం తమ వద్ద 108 గొర్రెల యూనిట్లను కొనుగోలు చేసిన పశుసంవర్ధకశాఖ అధికారులు 8 నెలలుగా తమకు రావాల్సిన  రూ.1.70 కోట్లను ఇప్పటి వరకు చెల్లించలేదని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన 10 మంది గొర్రెల విక్రేతలు పశుసంవర్ధక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచిఘోష్‌కు, తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ సుబ్బరాయుడికి సోమవారం ఫిర్యాదుచేశారు. గత అక్టోబరు 9 నుంచి 15 వరకు రంగారెడ్డి జిల్లాకు చెందిన అధికారులు కర్నూలు వెళ్లి పి.దస్తగిరి, రాజునారాయణ, అల్లంరాజు సురేశ్, నాగేశ్వరి, రాజేంద్ర, పుల్లప్ప, ఆంజనేయులు, రాజా, సుధాకర్, వెంకటసుబ్బారెడ్డి నుంచి 108 యూనిట్ల గొర్రెలను కొనుగోలు చేశారు. ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక పోతు ఉంటాయి. కొనుగోలు అనంతరం వారి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి, వాటిల్లో నిధులను జమ చేస్తామని చెప్పారు. మొత్తంగా రూ.1,70,64,000 వెంటనే చెల్లిస్తామని తెలిపారు. అప్పటి నుంచి విక్రేతలు తెలంగాణ అధికారుల వద్దకు వచ్చి డబ్బులు అడుగుతున్నారు. కొనుగోళ్ల అనంతరం ఎన్నికల కోడ్‌ వచ్చిందని చెప్పి డబ్బులు ఇవ్వలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత వారు మళ్లీ రాష్ట్రానికి వచ్చి పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు.. గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీని కలిసి డబ్బుల కోసం అడిగినా వారు స్పందించలేదు. దీంతో తమ సొమ్మును గుత్తేదారు మొయిద్‌ కాజేశారనే అనుమానంతో తాజాగా వారు పశుసంవర్ధకశాఖ ముఖ్యకార్యదర్శి, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీని కలిసి ఫిర్యాదుచేశారు. ఈ వ్యవహారంపై రంగారెడ్డి జిల్లా అధికారులను వివరణ అడిగారు. కర్నూలు నుంచి గొర్రెలు కొనుగోలు చేసిన అధికారుల్లో ఒకరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంతో చెల్లింపులు నిలిచిపోయాయని తెలిపారు. చెక్కులు సిద్ధంగా ఉన్నాయని, గొర్రెల యూనిట్ల పంపిణీ జరిగిందీ.. లేనిదీ పరిశీలించిన అనంతరం ప్రభుత్వం అనుమతిస్తే విక్రేతల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని