చిన్నతరహా పరిశ్రమలకు పెద్దపీట: మంత్రి శ్రీధర్‌బాబు

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) సంబంధించి విధి విధానాలను రూపొందించి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రకటించారు.

Published : 25 Jun 2024 04:53 IST

మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఒప్పంద పత్రాలను చూపుతున్న డా.గ్లోరీ స్వరూప,
జయశ్రీదాస్‌ వర్మ, చిత్రంలో ప్రియా గజ్దర్‌ (మధ్యలో నీలం చీర)

సోమాజిగూడ, న్యూస్‌టుడే: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) సంబంధించి విధి విధానాలను రూపొందించి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రకటించారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా ఎంఎస్‌ఎంఈ పాలసీ, విధివిధానాలను ప్రవేశపెట్టలేకపోయిందని విమర్శించారు. సోమవారం సోమాజిగూడలోని పార్కు హోటల్‌లో నైపుణ్య శిక్షణపై ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఫ్లో)- నిమ్స్‌మే మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. మంత్రి సమక్షంలో ఫ్లో జాతీయ అధ్యక్షురాలు జయశ్రీ దాస్‌ వర్మ, నిమ్స్‌మే డైరెక్టర్‌ జనరల్‌ డా.గ్లోరీ స్వరూప ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. భారతదేశ ఆర్థిక ప్రగతిలో ఎంఎస్‌ఎంఈలు ముఖ్య భూమిక పోషిస్తాయని, అందువల్ల ఎంఎస్‌ఎంఈకి పెద్దపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. స్కిల్‌ యూనివర్సిటీ, ఏఐసీటీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, ఏఐసీటీకోసం 200 ఎకరాల స్థలం కేటాయించినట్లు వివరించారు. మూడంచెల్లో పారిశ్రామిక అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు. పరిశ్రమలూ కేవలం హైదరాబాద్‌కే పరిమతం కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు రావాలని కోరారు. జయశ్రీ దాస్‌ వర్మ మాట్లాడుతూ.. ఎంఎస్‌ఎంఈలు జీడీపీలో 30%, ఉత్పాదక ఉత్పత్తిలో 45% ఉండటమే కాకుండా 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. సమావేశంలో ఫ్లో సభ్యులతో పాటు పలువురు ఔత్సాహికులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని