నైనీ గనిలో బొగ్గు తవ్వకాలకు సహకరిస్తాం

ఒడిశాలోని నైనీ వద్ద సింగరేణి సంస్థ చేపట్టిన బొగ్గు గని ప్రాజెక్టులో తవ్వకాలకు పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే 783 హెక్టార్ల అటవీ భూమి బదలాయింపునకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ప్రదీప్‌ కుమార్‌ జెనా హామీ ఇచ్చారు.

Published : 25 Jun 2024 04:54 IST

సింగరేణి సీఎండీకి ఒడిశా సీఎస్‌ హామీ

ఈనాడు, హైదరాబాద్‌: ఒడిశాలోని నైనీ వద్ద సింగరేణి సంస్థ చేపట్టిన బొగ్గు గని ప్రాజెక్టులో తవ్వకాలకు పూర్తి సహకారం అందిస్తామని, త్వరలోనే 783 హెక్టార్ల అటవీ భూమి బదలాయింపునకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ప్రదీప్‌ కుమార్‌ జెనా హామీ ఇచ్చారు. సోమవారం సింగరేణి సీఎండీ ఎన్‌.బలరాం, ఇతర అధికారులు భువనేశ్వర్‌లో ఒడిశా సీఎస్‌ను కలిశారు. నైనీ ప్రాజెక్టుపై చర్చించారు. సెప్టెంబరు నెలాఖరు నాటికి బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యేలా సహకరించాలని, నైనీ సమీపంలో నిర్మించతలపెట్టిన 1,600 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటుకు స్థలం కేటాయించాలని విన్నవించారు. బొగ్గు తవ్వకాలకు అన్ని అనుమతులు లభించాయని, రెండో దశ కింద ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వాల్సి ఉందని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు రూ.180 కోట్లు ఒడిశా ప్రభుత్వానికి చెల్లించినట్లు వివరించారు. ఈ మేరకు సీఎస్‌ ప్రదీప్‌ కుమార్‌ జెనా సానుకూలంగా స్పందించారు. అనంతరం బలరాం ఒడిశా రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి హేమంత్‌ శర్మను కలిశారు. నైనీ గనికి 50 కిలోమీటర్ల దూరంలో థర్మల్‌ ప్లాంటు ఏర్పాటుకు గతంలో నాలుగు ప్రదేశాలను పరిశీలించామని, అందుకు అవసరమైన 800 ఎకరాల కేటాయింపునకు ఒడిశా ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కావాలని కోరారు. అందుకు హేమంత్‌ శర్మ సానుకూలంగా స్పందించారని సింగరేణి సీఎండీ మీడియాకు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని