చెంచు మహిళపై దాడి అమానవీయం

చెంచు మహిళపై అత్యంత పాశవికంగా దాడికి పాల్పడటం అమానవీయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లిలో కొన్ని రోజుల క్రితం ఈశ్వరమ్మపై దాడి జరిగింది.

Published : 25 Jun 2024 04:56 IST

నిమ్స్‌లో బాధితురాలిని పరామర్శించిన భట్టి, జూపల్లి

డైరెక్టర్‌ బీరప్పను అడిగి ఈశ్వరమ్మ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పక్కన జూపల్లి

నిమ్స్, న్యూస్‌టుడే: చెంచు మహిళపై అత్యంత పాశవికంగా దాడికి పాల్పడటం అమానవీయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లిలో కొన్ని రోజుల క్రితం ఈశ్వరమ్మపై దాడి జరిగింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆదివారం రాత్రి హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆమెను పరామర్శించారు. బాధిత మహిళ, ఆమె కుటుంబికులతో మాట్లాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ తలదించుకునే దారుణమైన ఘటన అని అన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే మంత్రి జూపల్లి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వమే వైద్యం అందించేలా చొరవ తీసుకోవాలని సూచించామన్నారు. ఇప్పటికే దాడి చేసిన వారిని పోలీసులు రిమాండ్‌కు తరలించారని, బాధిత మహిళ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇంటిని కేటాయించేలా చొరవ తీసుకుంటామని భట్టి హామీ ఇచ్చారు. పిల్లలను ఆశ్రమ పాఠశాలలో ఉన్నత చదువులు చదివించడంతోపాటు వ్యవసాయ భూమి కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. న్యూరాలజీ, జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ విభాగం వైద్యులు బాధితురాలికి వైద్యం అందిస్తున్నారని, పరిస్థితి మెరుగుపడిందని నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప వివరించారు. చికిత్స పొందుతున్న ఈశ్వరమ్మను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌ చిన్నారెడ్డి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజా సంఘాల ఐకాస ఛైర్మన్‌ జి.చెన్నయ్య, ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రనాయక్, అసోసియేట్‌ అధ్యక్షుడు మోహన్‌ సింగ్‌లు పరామర్శించారు. దాడి చేసిన వారిని ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.  

మెరుగైన వైద్యం అందించండి: మంత్రి దామోదర్‌ రాజనర్సింహ 

ఈశ్వరమ్మకు మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్పను ఫోన్‌లో ఆదేశించారు. ఆమె వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని