సంక్షిప్త వార్తలు (6)

దేశంలోని ఉత్తమ రవాణా విధానాన్ని తెలంగాణలోనూ తీసుకువస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Updated : 26 Jun 2024 06:00 IST

ఉత్తమ రవాణా విధానాలపై అధ్యయనం: మంత్రి పొన్నం

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని ఉత్తమ రవాణా విధానాన్ని తెలంగాణలోనూ తీసుకువస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. నూతన రవాణా విధానం కోసం వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తామని మంగళవారం వెల్లడించారు. రాష్ట్రాల వారీగా వేర్వేరు పన్నుల విధానం అమలవుతోందని..అందులో ఆదాయం పెంచుకోవడానికి అనువుగా ఉండేవాటిపై దృష్టి సారిస్తామన్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లో అధ్యయనం ఉంటుందని వివరించారు. దీనికోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేశామనీ .. ఒక్కో బృందంలో డీటీసీ, ఆర్టీవో, ఎంవీఐ ఉంటారని పేర్కొన్నారు.


ఉద్యోగుల సమస్యలపై త్రిసభ్య కమిటీ భేటీ 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ మంగళవారం ప్రజాభవన్‌లో భేటీ అయింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ చిన్నారెడ్డి, తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రజావాణి స్టేట్‌ నోడల్‌ అధికారిణి దివ్య సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అన్ని స్థాయుల ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి అందిన వివిధ వినతిపత్రాలను త్రిసభ్య కమిటీ సభ్యులు నిశితంగా అధ్యయనం చేశారు. వీటిపై నివేదిక రూపొందించి వీలైనంత తొందరగా ముఖ్యమంత్రికి అందించాలని, సమస్యలపై తరచూ భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు.  


వెబ్‌సైట్లో డీఏవో పరీక్ష హాల్‌టికెట్లు

ఈనాడు, హైదరాబాద్‌: డివిజనల్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌(డీఏవో) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి ఈనెల 30 నుంచి జులై 4 వరకు నిర్వహించే పరీక్షలకు హాల్‌టికెట్లు టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి.


వ్యవసాయరంగ అభివృద్ధితోనే ప్రయోజనం: భట్టి 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణకు వ్యవసాయం ప్రాణప్రదమైందని, ఆ రంగం అభివృద్ధి చెందితే ఉత్పత్తులు పెరిగి.. రాష్ట్ర ఖజానాకు, రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. రైతుల సంక్షేమం కోసం పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నామని, అవి సద్వినియోగం కావాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల అభిప్రాయాల మేరకే రైతుభరోసా అమలు చేయాలని, అభిప్రాయ సేకరణలో మంత్రులు పాల్గొనాలని కోరారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుభరోసా, రుణమాఫీ, బీమా పథకాలకు నిధుల అవసరంపై చర్చించారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నిలిపివేసిన వ్యవసాయ పథకాల గురించి భట్టి ఆరా తీశారు. రాబోయే సీజన్‌కు పంటల బీమాకు సంబంధించి పిలవాల్సిన టెండర్లపై సమీక్షించారు.


ప్రజావాణికి 687 అర్జీలు

సోమాజిగూడ, న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారిణి దివ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 687 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూ-225, హౌసింగ్‌-59,  పౌరసరఫరాలశాఖ - 82, హోంశాఖ - 47, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి- 40, ఇతర శాఖలకు 234 అందినట్లు అధికారులు తెలిపారు.


వర్జీనియా పొగాకు.. రికార్డు ధర

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: వర్జీనియా పొగాకు రికార్డు ధర పలుకుతోంది. గత ఏప్రిల్‌ 27న గరిష్ఠంగా కిలో వర్జీనియా పొగాకు ధర రూ.341 పలికింది. తాజాగా మంగళవారం జంగారెడ్డిగూడెం కేంద్రంలో వర్జీనియా పొగాకు కిలో రూ.352 రికార్డు ధర పలికింది. ఈ కేంద్రానికి మొత్తం 1,025 పొగాకు బేళ్లు రాగా, 791 బేళ్ల విక్రయాలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని