సంక్షిప్త వార్తలు

మిల్లర్లకు కేటాయించిన ధాన్యం.. ఆయా మిల్లుల నుంచి పక్కదారి పడితే పౌరసరఫరాల శాఖ అధికారుల (డీసీఎస్‌ఓ)నూ బాధ్యుల్ని చేసి చర్యలు తీసుకుంటామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ హెచ్చరించారు.

Updated : 04 Jul 2024 04:23 IST

మిల్లుల్లో ధాన్యం పక్కదారి పడితే అధికారులపైనా చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: మిల్లర్లకు కేటాయించిన ధాన్యం.. ఆయా మిల్లుల నుంచి పక్కదారి పడితే పౌరసరఫరాల శాఖ అధికారుల (డీసీఎస్‌ఓ)నూ బాధ్యుల్ని చేసి చర్యలు తీసుకుంటామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ హెచ్చరించారు. అన్ని జిల్లాల అధికారులతో బుధవారం ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించిన ఆయన .ప్రతి రైస్‌ మిల్లును కనీసం నెలకోసారి అయినా తనిఖీ చేసి నిల్వలపై నివేదికలు పంపించాలని ఆదేశించారు. ధాన్యం లెక్కల్లో తేడాలు ఉంటే కఠినంగా వ్యవహరించాలని సూచించారు. 


గుంటూరు రైలు ఔరంగాబాద్‌ వరకు పొడిగింపు

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: గుంటూరు, సికింద్రాబాద్‌ల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలును ఈ నెల ఒకటి నుంచి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. గుంటూరు-ఔరంగాబాద్‌ రైలు(17253) గుంటూరు నుంచి బయలుదేరి నరసరావుపేట, మార్కాపురం, నంద్యాల, డోన్, కర్నూలు, గద్వాల, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, కాచిగూడ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, బీదర్, లాతూర్‌ రోడ్, పర్లి వైద్యనాథ్, పర్భణీ, ఝాల్నా మీదుగా ఔరంగాబాద్‌ చేరుకుంటుంది. ఔరంగాబాద్‌-గుంటూరు రైలు(17254)  తిరుగు ప్రయాణంలో ఇదే మార్గంలో నడుస్తుందని వివరించారు. 


సంక్షేమ గురుకులాల్లో ఉమ్మడి టైంటేబుల్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సాధారణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో ఉమ్మడి టైం టేబుల్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8.15 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు విద్యార్థులకు బోధన తరగతులు ఉంటాయి. వారిని తెల్లవారుజామున ఐదు గంటలకు మేల్కొలుపుతారు. ఉదయం ఏడు గంటలకు టిఫిన్‌ ఇస్తారు. 5, 6, 7 తరగతులకు మధ్యాహ్నం 12.45 నుంచి 1.30 వరకు, ఎనిమిదో తరగతి నుంచి పైతరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 1.25 నుంచి 2.15 గంటల వరకు భోజనం అందిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 4.45 వరకు స్నాక్స్, అనంతరం 5.45 వరకు క్రీడలు ఉంటాయి. రాత్రి భోజనం సాయంత్రం 6.15 నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది. రాత్రి తొమ్మిది గంటలకు విద్యార్థులు నిద్రపోతారు.


వీఆర్‌ఏలకు ఊరట 

ఈనాడు, హైదరాబాద్‌: సాంకేతిక కారణాలతో ఇప్పటికీ వీఆర్‌ఏలుగా కొనసాగుతున్న 154 మందికి ప్రభుత్వం ఊరట కలిగించింది. వారిని వివిధ శాఖల్లోకి సర్దుబాటు చేస్తూ సీసీఎల్‌ఏ నవీన్‌ మిత్తల్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్హతల ఆధారంగా జూనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అసిస్టెంట్, ఆఫీస్‌ సబార్డినేట్‌ హోదాల్లో సర్దుబాటు చేశారు. జిల్లాలు, శాఖలను కేటాయించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.


ఉద్యోగుల బదిలీలకు అనుమతిపై సంఘాల హర్షం

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై టీఎన్‌జీఓ హర్షం వ్యక్తం చేసింది. ఉద్యోగుల బదిలీలను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని టీజీఓ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాచర్ల రామకృష్ణగౌడ్‌ కోరారు. 

అంగన్‌వాడీ ఉద్యోగులకు 45 సంవత్సరాల వయసు నిబంధనను తొలగించి పదోన్నతులు కల్పించాలని మంత్రి సీతక్కను టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్, టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కోరారు. 


ప్రభాకర్‌ ఆత్మహత్యపై విచారణ చేయాలి: కోదండరెడ్డి 

హైదరాబాద్, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లాలో రైతు ప్రభాకర్‌ ఆత్మహత్య ఘటనపై పూర్తి విచారణ చేయాలని కిసాన్‌ కాంగ్రెస్‌ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు ఆ విభాగం జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి తెలిపారు. కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌రెడ్డితో కలిసి బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన వ్యవసాయ భూమిని ఆక్రమించారన్న ఆవేదనతో రైతు ప్రభాకర్‌.. స్వయంగా వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకుంటే అక్కడున్న భారాస నాయకులు ఆయనను అడ్డుకోకపోవడం దారుణమన్నారు. హక్కు ఉన్న ప్రతి రైతుకు భూమి హక్కు పత్రాలు వస్తాయన్నారు. అన్వేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. భారాస నేతలు ప్రభాకర్‌ను రెచ్చగొట్టి, ఆత్మహత్యకు పురిగొల్పారని ఆరోపించారు.


వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు ఇవ్వాలి: కోదండరాం
10 నుంచి ఆందోళనలకు కార్మిక సంఘాల ఐక్య వేదిక పిలుపు

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలం లేకుండానే సింగరేణికి అప్పగించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక (హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టీయూ, టీఎస్‌యూఎస్‌ (ఎస్వీ) ఏఐఎఫ్‌టీయూ, ఐఎన్‌టీయూసీ) ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ.. ట్రేడ్‌ యూనియన్లు తలపెట్టిన దశలవారీ ఆందోళన విజయవంతానికి సహకరిస్తామన్నారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు దృష్ట్యా బొగ్గు గనుల ప్రైవేటీకరణ శ్రేయస్కరం కాదన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క మాట్లాడారు. ట్రేడ్‌ యూనియన్ల ఐక్య వేదిక కన్వీనర్‌ రియాజ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీఎన్‌టీయూసీ జాతీయ నాయకుడు బోస్, ఐఎఫ్‌టీయూ జాతీయ నాయకుడు శ్రీనివాస్‌ తదితరులు మాట్లాడారు. వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించాలన్న డిమాండ్‌తో ఈ నెల 10 నుంచి 24 దాకా జీఎం కార్యాలయాల వద్ద ధర్నాలు, 29న కొత్తగూడెంలో నిరాహార దీక్ష, ఆగస్టు 1న హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో మహాధర్నా, తదుపరి ముఖ్యమంత్రి, కేంద్ర గనుల శాఖ మంత్రికి వినతులు ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. 


రూ.కోట్ల పనులకు లక్కీ డ్రా!
మంచిర్యాల మున్సిపాలిటీ తీరుపై విమర్శలు 

మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే: టెండర్‌ ప్రాతిపదికన అర్హులైన గుత్తేదారులకు పనులను కట్టబెట్టాల్సిన పాలకవర్గ సభ్యులు ‘లక్కీ డ్రా’ పద్ధతిన వాటిని పంచిన వైనమిది. మంచిర్యాల మున్సిపాలిటీలో బుధవారం చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల పట్టణంలోని 36 వార్డుల్లో రహదారులు, మురుగుకాలువల నిర్మాణానికి మున్సిపల్‌ సాధారణ నిధుల నుంచి దాదాపు రూ.2 కోట్లు కేటాయించారు. ఒక్కో వార్డులో రూ.5 లక్షల చొప్పున పనులు చేపట్టేందుకు ఆన్‌లైన్‌ సివిల్‌ టెండర్లు పిలిచారు. అయితే, మున్సిపల్‌ ఛైర్మన్‌ రావుల ఉప్పలయ్య, వైస్‌ ఛైర్మన్‌ సల్లా మహేశ్‌ మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలోని ఐకేపీ భవనంలో లక్కీ డ్రా తీసి గుత్తేదారులకు పనులను పంచిపెట్టారు. పనుల నుంచి పర్సంటేజీలు దక్కించుకోవడానికే పాలకవర్గ సభ్యులు లక్కీ డ్రా అంటూ కొత్త పంథా ఎంచుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. గుత్తేదార్లు లెస్‌ టెండర్లు వేసి నష్టపోవద్దనే ఉద్దేశంతోనే లక్కీ డ్రా ద్వారా గుత్తేదార్లకు పనులను అప్పగించామని మున్సిపల్‌ ఛైర్మన్‌ ఉప్పలయ్య విలేకరులకు తెలిపారు. ఎవరికి కేటాయించిన పనికి వారే ఈ నెల 5న ఆన్‌లైన్‌లో టెండరు వేయాలని, పనులను నాణ్యంగా చేయాలని గుత్తేదారులకు సూచించామని అన్నారు.


వర్షాభావంపై ఆందోళన వద్దు
వ్యవసాయ విశ్వవిద్యాలయం 

ఈనాడు, హైదరాబాద్‌: వరిని నేరుగా విత్తే విధానాన్ని పాటిస్తే... పైరు సకాలంలో చేతికి అందుతుందని, అధిక దిగుబడులు వస్తాయని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. వానాకాలం సీజన్‌లో వివిధ పంటల్లో రైతులు చేపట్టాల్సిన సాగు, యాజమాన్య పద్ధతులు, విత్తనాల ఎంపిక తదితర అంశాలపై వర్సిటీ శాస్త్రవేత్తలు బుధవారం రైతులకు వివిధ సూచనలు చేశారు. వర్షాభావంపై రైతులు ఆందోళన చెందొద్దు అని, దీర్ఘ, మధ్యకాలిక రకాలకంటే స్వల్పకాలిక వరి వంగడాలనే సాగు చేయాలని పేర్కొన్నారు.


పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి బదిలీ 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఆయన స్థానంలో రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి డీఎస్‌ లోకేశ్‌కుమార్‌కు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వం ఇటీవల సందీప్‌కుమార్‌ను ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. తాజాగా ఆయనను పంచాయతీరాజ్‌ బాధ్యతల నుంచి తప్పించింది. 


పెంటారెడ్డి పదవీ కాలం పొడిగింపు

ఈనాడు హైదరాబాద్‌: నీటిపారుదల శాఖలో ఎత్తిపోతల పథకం సలహాదారుగా ఉన్న పెంటారెడ్డి పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా బుధవారం ఆదేశాలు జారీ చేశారు.


అర్చక, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

ఈనాడు, హైదరాబాద్‌:  అర్చక, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఐకాస కోరింది. 2017 వరకు రాష్ట్రంలో పనిచేస్తున్న అర్చకులందరినీ క్రమబద్ధీకరించాలని అభ్యర్థించింది. రాష్ట్ర అర్చక, ఉద్యోగ ఐకాస రాష్ట్ర కమిటీ సమావేశం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఐకాస ఛైర్మన్‌ గంగు ఉపేంద్రశర్మ, కన్వీనర్‌ రవీంద్రచార్యులు, అర్చక సంఘం అధ్యక్షుడు బద్రినాథాచార్యులు, ఉద్యోగ సంఘం అధ్యక్షులు కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొని మాట్లాడారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని