మండల ప్రజాపరిషత్‌లకు ప్రత్యేకాధికారులు

రాష్ట్రంలో పాలకవర్గాల పదవీకాలం ముగిసిన మండల ప్రజాపరిషత్‌లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో నం.43) జారీ చేసింది.

Published : 04 Jul 2024 03:18 IST

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
ముగిసిన పాలకవర్గాల పదవీకాలం
జడ్పీలకు నేడు జీవో

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాలకవర్గాల పదవీకాలం ముగిసిన మండల ప్రజాపరిషత్‌లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు (జీవో నం.43) జారీ చేసింది. వాటికి మళ్లీ ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేకాధికారులు కొనసాగుతారని పేర్కొంది. తెలంగాణలో మండల ప్రజాపరిషత్‌లకు ప్రత్యేకాధికారుల నియామకం జరగడం ఇది రెండోసారి. గతంలో 2018లో ప్రత్యేకాధికారుల నియామకం జరిగింది. అనంతరం 2019 మేలో 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. 490 మండల ప్రజాపరిషత్‌ పాలకవర్గాలకు అదే ఏడాది జులై 4న ఎన్నికలు నిర్వహించారు. అదేరోజు ఎంపీపీలు, ఉపాధ్యక్షులు ప్రమాణస్వీకారం చేశారు. వారి పదవీకాలం బుధవారంతో ముగిసింది. ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లోని అన్ని మండల ప్రజాపరిషత్‌లతో పాటు నాగర్‌కర్నూల్‌; మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల; మహబూబాబాద్‌ జిల్లా గార్ల, బయ్యారం; ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట మినహా రాష్ట్రంలోని అన్ని మండల ప్రజాపరిషత్‌లకు ప్రత్యేకాధికారులను నియమించాలని, గురువారం నుంచి వారు బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. మండల ప్రజాపరిషత్‌లకు ప్రత్యేకాధికారులుగా ఎంపీడీవో కంటే ఒక ర్యాంకు పైస్థాయిలో ఉన్న జిల్లాస్థాయి అధికారులు, ఉప కలెక్టర్లు, ఆర్డీవోలను నియమించాలని.. ఇంజినీరింగ్‌ అధికారులను దీని నుంచి మినహాయించాలని స్పష్టం చేసింది. ఆమేరకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్లు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. 

జడ్పీలకు కలెక్టర్లు.. 

రాష్ట్రంలోని 28 జిల్లా పరిషత్‌ పాలకవర్గాలకు, జడ్పీటీసీలకు పదవీకాలం గురువారంతో ముగియనుంది. ఈ మేరకు జడ్పీలకు జిల్లా కలెక్టర్లను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్‌ జడ్పీ పాలకవర్గాలకు ఆగస్టు 6 వరకు గడువు ఉంది. వాటికి పదవీకాలం ముగిసిన తర్వాత అక్కడ ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని