ఉత్తర తెలంగాణలో హైదరాబాద్‌ వర్సిటీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయండి

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ సెంటర్‌ను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని భారాస సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ కేంద్రాన్ని కోరారు.

Published : 04 Jul 2024 03:19 IST

కేంద్ర మంత్రికి వినోద్‌కుమార్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ సెంటర్‌ను ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని భారాస సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ కేంద్రాన్ని కోరారు. ఈ విషయంపై హైదరాబాద్‌లోని ఆల్‌ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ బుధవారం వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందించింది. ఇదే విషయంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌కు ఆయన లేఖ రాశారు. ‘‘పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి వరంగల్‌ లేదా కరీంనగర్‌లో హైదరాబాద్‌ విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను ఏర్పాటు చేయండి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సమానమైన విద్యాభివృద్ధిని ప్రోత్సహించినట్లు అవుతుంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుసరించిన నమూనాల మాదిరిగానే.. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లోనూ తెలంగాణ విద్యార్థులకు స్థానిక కోటాను ప్రవేశపెట్టండి. జాతీయ స్థాయిలో నిర్వహించే ఎంట్రన్స్‌ పరీక్షలను ఆంగ్లం, హిందీలో కాకుండా స్థానిక మాతృభాషల్లో నిర్వహించాలి’’ అని వినోద్‌కుమార్‌ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని