జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌కు ప్రత్యామ్నాయం సూచించండి

జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా నేల స్వభావాన్ని అంచనా వేసేందుకు గాను నమూనాల సేకరణకు డ్రిల్లింగ్‌ చేస్తున్న సమయంలో భారీగా నీరు, ఇసుక బయటకు వస్తుండటంతో పరీక్షలను నిలిపివేశామని.. ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో సూచించాలని నేషనల్‌ డ్యాం సేప్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ)ని నీటిపారుదలశాఖ కోరింది.

Published : 04 Jul 2024 03:20 IST

‘కాళేశ్వరం’పై ఎన్డీఎస్‌ఏకు నీటిపారుదల శాఖ లేఖ
రాఫ్ట్‌ వద్ద డ్రిల్లింగ్‌లో భారీగా నీరు, ఇసుక వస్తుండటమే కారణం
నమూనాల సేకరణ నిలిపివేత

అన్నారం బ్యారేజీలో జియోటెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌ కోసం డ్రిల్లింగ్‌ చేస్తున్న సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా నేల స్వభావాన్ని అంచనా వేసేందుకు గాను నమూనాల సేకరణకు డ్రిల్లింగ్‌ చేస్తున్న సమయంలో భారీగా నీరు, ఇసుక బయటకు వస్తుండటంతో పరీక్షలను నిలిపివేశామని.. ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో సూచించాలని నేషనల్‌ డ్యాం సేప్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ)ని నీటిపారుదలశాఖ కోరింది. ఈ మేరకు ఎన్డీఎస్‌ఏకు రాష్ట్ర డ్యాం సేప్టీ అథారిటీ లేఖ రాసినట్లు తెలిసింది. 

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తాత్కాలిక మరమ్మతులతో పాటు ఇన్వెస్టిగేషన్స్‌ చేపట్టాలని ఎన్డీఎస్‌ఏ గతంలో సూచించింది. ఎన్డీఎస్‌ఏ సిఫారసుల మేరకు పనులు చేపట్టడంతోపాటు ఇన్వెస్టిగేషన్స్‌ ప్రారంభించారు. పుణెలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌), దిల్లీలోని సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్స్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) నిపుణులు బ్యారేజీలను పరిశీలించారు. ఎన్డీఎస్‌ఏతో పాటు ఈ సంస్థల నిపుణుల సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ఇన్వెస్టిగేషన్స్‌ కోసం నమూనాలు సేకరిస్తున్నారు. అన్నారం బ్యారేజీలో రాఫ్ట్‌ నుంచి కోర్‌ కటింగ్‌ చేసి.. నమూనాలు సేకరించడం ప్రారంభించారు. అన్నారం బ్యారేజీలో నాలుగు పియర్స్‌ వద్ద సీపేజీ గుర్తించి కెమికల్‌ గ్రౌటింగ్, కాంక్రీట్‌ గ్రౌటింగ్‌ చేశారు. అయితే సీపేజీ ఎక్కడి నుంచి వస్తోంది, పై నుంచి కిందికి ఉందా లేదా తెలుసుకోవడం, నేల స్వభావాన్ని అంచనా వేసేందుకు జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌కు నమూనాల సేకరణ చేపట్టారు. 25 మీటర్ల లోతులో ఉన్న మట్టి స్వభావాన్ని తెలుసుకునేందుకు.. నమూనాల సేకరణకు డ్రిల్లింగ్‌ చేయాలి. 125 మి.మీ. డయాతో డ్రిల్లింగ్‌ చేసి 100 ఎం.ఎం కేసింగ్‌ పైపుతో 75 మి.మీ. బిట్‌ను తీయాల్సి ఉంటుంది. సీపేజీ వచ్చిన ఒక్కో పియర్‌ వద్ద బ్యారేజీ ఎగువన ఒక నమూనా, దిగువన ఇంకో నమూనా.. ఇలా నాలుగు పియర్స్‌ వద్ద ఎనిమిది నమూనాలను సేకరించాల్సి ఉంది. 35వ పియర్‌ వద్ద మొదటి నమూనా సేకరణకు రాఫ్ట్‌ వద్ద డ్రిల్లింగ్‌ చేపట్టగా.. భారీగా నీటితో పాటు ఇసుక కూడా కలిసి రావడంతో నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇంజినీర్లు ఆందోళనకు గురైనట్లు తెలిసింది. గతంలో సీపేజీ ఉన్నా ఇసుక రాలేదు. ఇప్పుడు కోర్‌ డ్రిల్లింగ్‌లో ఇసుక కూడా రావడంతో నమూనాల సేకరణ ప్రక్రియను నిలిపివేశారు. పుణెలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ నిపుణుల సమక్షంలో మళ్లీ డ్రిల్లింగ్‌ చేపట్టారు. అయినప్పటికీ అదే పరిస్థితి కొనసాగడంతో ఆ పనులను నిలిపివేశారు. సుందిళ్ల బ్యారేజీలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఎన్డీఎస్‌ఏ సూచించిన విధంగా జియోటెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ చేయడం వీలు కాదని, ప్రత్యామ్నాయం కోరాలని రాష్ట్ర డ్యాం సేప్టీ అథారిటీ అధికారులకు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ లేఖ రాశారు. వీలైనంత త్వరగా జియో టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌కు ప్రత్యామ్నాయం తెలపాలని కోరారు. వర్షాకాలం ప్రారంభమైనందువల్ల వరద మొదలైతే పరీక్షలు చేయడం వీలు కాదు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం చీఫ్‌ ఇంజినీర్‌ రాసిన లేఖ ఆధారంగా రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ, ఓ అండ్‌ ఎం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు.. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీకి లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై అధ్యయనం

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై పుణెలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌)తో అధ్యయనం చేయించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. మూడు బ్యారేజీలకు కలిపి ఇంటిగ్రేటెడ్‌(సమీకృత) బ్యాక్‌వాటర్‌ స్టడీ వెంటనే చేయించాలని కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ను నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని