కళ్లెదుటే తిరుగుతున్నా సమన్లు అందించలేరా!

ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో విచారణ జరుగుతున్న తీరుపై బుధవారం హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

Published : 04 Jul 2024 03:20 IST

నెలలో 9 మాత్రమే జారీ చేయడమేంటి?
ప్రజాప్రతినిధుల కేసుల్లో విచారణ తీరుపై హైకోర్టు అసంతృప్తి
నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర ప్రజాప్రతినిధులు నిందితులుగా ఉన్న కేసుల్లో విచారణ జరుగుతున్న తీరుపై బుధవారం హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత నెల విచారణ నుంచి ఇప్పటివరకు ఏమాత్రం పురోగతి లేకుండా ఎక్కడి కేసులు అక్కడే ఉండటంపై అసహనం వ్యక్తం చేసింది. నిందితులకు, సాక్షులకు సమన్లు జారీ చేయడంలో జాప్యమెందుకు జరుగుతోందని ప్రశ్నించింది. ‘నెల రోజుల్లో కేవలం 9 సమన్లు మాత్రమే జారీచేస్తారా? కళ్లెదుటే తిరుగుతున్నా సమన్లు ఎందుకు జారీచేయడం లేదు’ అని నిలదీసింది. నిందితులకు, సాక్షులకు సమన్ల జారీకి తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ్‌ కేసులో ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసుల సత్వర విచారణ నిమిత్తం.. సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటై ఈ అంశాన్ని సుమోటో పిటిషన్‌గా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. హైకోర్టు రిజిస్ట్రీ తరఫు సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ హైకోర్టుకు స్థాయీనివేదిక సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 115 కేసులు నేతలపై పెండింగ్‌లో ఉన్నాయని రిజిస్ట్రీ నివేదికలో పేర్కొంది. 46 సమన్లు జారీచేయాల్సి ఉందని పేర్కొంది. నివేదికను పరిశీలించిన ధర్మాసనం కేసుల విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడంపై ప్రశ్నించింది. ఈ దశలో అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ జోక్యం చేసుకుంటూ సమన్ల జారీలో ఎందుకు జాప్యం జరుగుతుందో వివరాలు తెలుసుకుంటామన్నారు. సత్వరం జారీ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను వాయిదా వేస్తూ కేసుల్లోని నిందితులకు, సాక్షులకు సమన్ల జారీకి చర్యలు తీసుకోవాలని, దానిపై పురోగతి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని