శిక్షణ ఇచ్చి ఖైదీల్లో మార్పు తెచ్చాం

తెలిసో తెలియకో తప్పుచేసి కారాగారానికి వచ్చిన ఖైదీలకు శిక్షకు బదులు.. శిక్షణ ఇచ్చి మార్పు తీసుకొచ్చామని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్ర తెలిపారు.

Published : 04 Jul 2024 03:22 IST

జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్ర
సత్ప్రవర్తన కలిగిన 213 మంది విడుదల
పెరోల్‌పై ఉన్న మరో 18 మందికీ విముక్తి

చర్లపల్లిలోని కేంద్ర కారాగారం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సౌమ్యామిశ్ర, చిత్రంలో రాజేశ్, మురళీబాబు, సంపత్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలిసో తెలియకో తప్పుచేసి కారాగారానికి వచ్చిన ఖైదీలకు శిక్షకు బదులు.. శిక్షణ ఇచ్చి మార్పు తీసుకొచ్చామని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్ర తెలిపారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులకు చదువులు చెప్పించామని, పలువురు డిగ్రీ, పీజీలు పూర్తి చేశారని, కొందరికి బంగారు పతకాలు వచ్చాయని వెల్లడించారు. జైలు నుంచి విడుదలయ్యాక కొత్త జీవితం ప్రారంభించేందుకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఖైదీలు తయారుచేసిన కార్పెట్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని వివరించారు. రాష్ట్రంలోని జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారిలో సత్ప్రవర్తన కలిగిన 213 మంది ఖైదీలు బుధవారం విడుదలయ్యారు. పెరోల్‌ తీసుకుని సొంతూళ్లలో ఉన్న మరో 18 మంది ఖైదీలు కూడా అర్హత పొందగా.. వారిని మళ్లీ పిలిపించి సాంకేతిక లాంఛనాల అనంతరం విడుదల చేయనున్నారు. ఖైదీల విడుదల కోసం చర్లపల్లిలోని కేంద్ర కారాగారం ఆవరణలో ఖైదీల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కౌన్సెలింగ్, జాబ్‌ మేళాలో సౌమ్యామిశ్ర  పాల్గొన్నారు. 10మంది మహిళలకు కుట్టుమిషన్లు అందించారు. సమీప జైళ్ల నుంచి విడుదలయ్యే పలువురు ఖైదీలను కూడా అధికారులు ఈ కార్యక్రమానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సౌమ్యామిశ్ర మాట్లాడారు. ‘‘విడుదలైన ఖైదీల్లో 70 మందికి జైళ్ల శాఖ పెట్రోలు బంకుల్లో, ముగ్గురు మహిళలకు స్టోర్లలో ఉపాధి కల్పించాం. ఉపాధి దొరకని ఖైదీలు అధికారుల్ని సంప్రదిస్తే అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తారు. తమ కుటుంబ సభ్యులను విడుదల చేయాలని కొందరు ప్రజావాణిలో వినతిపత్రం ఇవ్వడంతో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి కమిటీ వేశారు. క్యాబినెట్‌ అనుమతితో ఖైదీలు విడుదలయ్యారు. ఎన్నో ఏళ్ల తర్వాత కొత్త జీవితం ప్రారంభిస్తున్న వారికి ఇదే చివరి అవకాశం. మళ్లీ నేరాలు చేస్తే ఇంకో అవకాశం ఉండదు’’ అని ఆమె స్పష్టం చేశారు. ఐజీలు మురళీధర్‌బాబు, రాజేశ్‌ మాట్లాడుతూ.. జైళ్లు కేవలం శిక్షను అమలుచేసే కేంద్రాలు కాదని.. పరివర్తన తెచ్చే విద్యాలయాలని పేర్కొన్నారు. ఖైదీల్లో మార్పు వచ్చేందుకు కారాగారాల్లో అన్ని రకాల పరిస్థితులు కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జైళ్ల శాఖ డీఐజీలు శ్రీనివాస్, సంపత్, చర్లపల్లి జైలు సూపరింటెండెంట్‌ సంతోష్‌కుమార్‌ రాయ్, ఖైదీలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విడుదలైన ఖైదీల్లో చర్లపల్లి నుంచి 61 మంది, మహిళా జైలు 35, చర్లపల్లి ఓపెన్‌ఎయిర్‌ 31, చంచల్‌గూడ 27, వరంగల్‌ 20, నిజామాబాద్‌ 15, కరీంనగర్‌ 7, నల్గొండ 4, ఖమ్మం 4, ఆదిలాబాద్‌ 3, అసిఫాబాద్‌ 3, మహబూబ్‌నగర్‌ 2, సంగారెడ్డి జైలు నుంచి ఒకరు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని