నాలుగు జిల్లాలకే సగం ‘బాసర’ సీట్లు

బాసర ఆర్‌జీయూకేటీలోని మొత్తం సీట్లలో సగం నాలుగు జిల్లాల విద్యార్థులే దక్కించుకున్నారు. ఆ వర్సిటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ చదివేందుకు పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపికైన విద్యార్థుల ప్రాథమిక జాబితాను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇన్‌ఛార్జి ఉపకులపతి వి.వెంకటరమణ, వర్సిటీ అధికారులు బుధవారం సచివాలయంలో విడుదల చేశారు.

Published : 04 Jul 2024 03:23 IST

1,404 సీట్లలో 700 వాటికే
సీట్లు పొందిన వారిలో 69.51% మంది అమ్మాయిలే
బాసర ఆర్‌జీయూకేటీ సీట్ల కేటాయింపు

ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేస్తున్న బుర్రా వెంకటేశం, వెంకటరమణ తదితరులు 

 ఈనాడు, హైదరాబాద్‌: బాసర ఆర్‌జీయూకేటీలోని మొత్తం సీట్లలో సగం నాలుగు జిల్లాల విద్యార్థులే దక్కించుకున్నారు. ఆ వర్సిటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ చదివేందుకు పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపికైన విద్యార్థుల ప్రాథమిక జాబితాను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇన్‌ఛార్జి ఉపకులపతి వి.వెంకటరమణ, వర్సిటీ అధికారులు బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. మొత్తం 1,500 సీట్లు ఉండగా... 1404 సీట్లకు ఎంపికైన వారి జాబితాను వెల్లడించారు. మరో 96 సీట్లను దివ్యాంగులు, ఆర్మీ, ఎన్‌సీసీ, క్రీడా తదితర ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు కేటాయిస్తారు. ప్రాథమికంగా ఎంపికైన వారికి బాసర ఆర్‌జీయూకేటీ ప్రాంగణంలో ఈనెల 8, 9, 10 తేదీల్లో తొలి విడత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. కార్యక్రమంలో సంయుక్త కన్వీనర్లు డాక్టర్‌ కె.పామని, డాక్టర్‌ హెచ్‌.దత్తు తదితరులు పాల్గొన్నారు. 

అత్యధిక సీట్లు కొన్ని జిల్లాలకే... 

ప్రతి సంవత్సరం ఈ వర్సిటీలోని అత్యధిక సీట్లు కొన్ని జిల్లాల విద్యార్థులకే దక్కుతున్నాయి. మొత్తం 1,404 సీట్లలో ఈసారి సిద్దిపేట, నిజామాబాద్, సంగారెడ్డి, సిరిసిల్ల జిల్లాలకు 700 దక్కాయి. పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన, అందులోనూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఇక్కడ సీట్లు పొందుతారు. జిల్లాల వారీగా కోటా లేకపోవడంతో కొన్ని జిల్లాల వారు నష్టపోతున్నారన్న అభిప్రాయముంది. అందుకే మరో ప్రాంగణం ప్రారంభిస్తే అన్ని జిల్లాలకు సమప్రాధాన్యం దక్కుతుందని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.


ఇవీ ముఖ్యాంశాలు... 

  • 1,404 మందిలో అమ్మాయిలు 976 (69.51 శాతం), అబ్బాయిలు 428 (30.49 శాతం) మంది ఉన్నారు. 
  • మొత్తం సీట్లలో 95% ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికే దక్కాయి.  ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి వచ్చిన జీపీఏకు 0.4% అదనంగా కలుపుతారు. ఆ విధంగా 89.6% మంది సీట్లు సాధించారు. 
  • అత్యధికంగా విద్యార్థులు ఎంపికైన తొలి పది జిల్లాలు: సిద్దిపేట (330), నిజామాబాద్‌ (157), సంగారెడ్డి (132), సిరిసిల్ల (81), నిర్మల్‌ (72), కరీంనగర్‌(66), కామారెడ్డి (64), నల్గొండ (61), రంగారెడ్డి(46), సూర్యాపేట (45).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని